ఆర్కే అంత్యక్రియల ఫోటోలు విడుదల చేసిన మావోలు

  • తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో అంత్యక్రియలు

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అంత్యక్రియలు మావోయిస్టు లాంఛనాలతో పూర్తయ్యాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పామేడు-కొండపల్లి సరిహద్దులో నిన్న మధ్యాహ్నం 2గంటలకు ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. 

ఫోటోలను పరిశీలిస్తే అంత్యక్రియలకు మావోయిస్టులు భారీగా హాజరై కడసారి వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించి మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

చత్తీస్ గఢ్ లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల మధ్య దండకారణ్యంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కే గురువారం చనిపోయారు. 65 ఏళ్ల రామకృష్ణపై వివిధ రాష్ట్రాల్లో 200కు పైగా కేసులుండగా.. ఆయనపై కోటిన్నరకు పైగా రివార్డ్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎన్ కౌంటర్ల నుంచి ఆర్కే తృటిలో తప్పించుకుని బయటపడ్డారు.  ఆనాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు మీద తిరుమలలో జరిగిన బాంబు దాడిలో ఆర్కే ముఖ్యపాత్ర పోషించారు.