సూర్యాపేట, వెలుగు : 10 ఏండ్లలో రోబోటిక్ సర్జరీతో గుణాత్మక మార్పు వస్తుందని, రోబోటిక్ సర్జరీతో కచ్చితమైన ఫలితాలు వస్తాయని యశోద ఆస్పత్రి సోమాజీగూడ సీనియర్ అర్థోపెడిక్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ కీ హోల్ సర్జన్ డాక్టర్ సునీల్ అన్నారు. సోమవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మోకాళ్ల శాస్త్ర చికిత్సలో భాగంగా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అత్యాధునిక పద్ధతిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోకాళ్ల నొప్పులను నివారించేందుకు మొత్తం నాలుగు స్టేజీలు ఉంటాయని తెలిపారు.
మొదటి రెండు స్టేజీల వరకు ఇంజక్షన్ తీసుకోవచ్చని, ఆఖరి రెండు స్టేజీల్లో శస్త్ర చికిత్స మాత్రమే పని చేస్తుందన్నారు. చాలామంది శస్త్ర చికిత్సకు భయపడి ఇంజక్షన్ మాత్రమే చేసుకొని మోసపోతున్నారని చెప్పారు. ప్రతిఒక్కరూ తమ మోకాళ్ల అరుగుదలను కనుగొని శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. అనంతరం రోబోటిక్ సర్జరీ చేయించుకున్న జిల్లా కేంద్రానికి చెందిన మంత్రమూర్తి శంకరమూర్తి, సంజీవరెడ్డి తమ అనుభవాలను పంచుకున్నారు.