నేను మంత్రికి పైసలియ్యలేదని ప్రమాణం చేస్తున్నా : రోహిత్‌రావు

నేను మంత్రికి పైసలియ్యలేదని ప్రమాణం చేస్తున్నా  :  రోహిత్‌రావు

కరీంనగర్, వెలుగు: తాను మంత్రి పొన్నం ప్రభాకర్ కు డబ్బులియ్యలేదని, తన ఇష్టదైవమైన మల్లికార్జున స్వామి పై ప్రమాణం చేస్తున్నానని, బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడిగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని బండి సంజయ్ దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా అని పీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ లోని ఓ హోటల్ లో రోహిత్ రావు మాట్లాడుతూ రాణి రుద్రమ నిజానిజాలను తెలుసుకొని ఆరోపణలు చేయాలని, పొన్నం ప్రభాకర్ మచ్చలేని మహా నాయకుడు అని పేర్కొన్నారు. మంత్రిపై చేసిన ఇతర ఆరోపణలన్నింటికి తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. బండి సంజయే రాణిరుద్రమతో ఇలా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. ఐదేండ్లలో చేసిన అభివృద్ధిపై సంజయ్ బహిరంగ చర్చకు రావాలని, తాము పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధిని చూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఎంతోమందికి  టికెట్లు ఇస్తామని చెప్పి రూ.వందల కోట్లు దండుకొని నమ్మకద్రోహం చేశాడని ఆరోపించారు.లీడర్లతో ఖర్చు చేయించి, దొంగ లెక్కలు చూపించి బీజేపీ అధిష్టానం నుంచి డబ్బులు తీసుకుంది నిజం కదా అని ప్రశ్నించారు. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శులు వైద్యుల అంజన్ కుమార్, రహమాత్ హుస్సేన్, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, బీసీ సెల్  జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.