జైపూర్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. రోహిత్ రాయుడు (102) సెంచరీతో చెలరేగినా.. బౌలర్లు ఫెయిల్ కావడంతో సోమవారం జరిగిన గ్రూప్–బి మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చత్తీస్‌గఢ్ చేతిలో పరాజయం చవిచూసింది. టాస్ ఓడిన హైదరాబాద్ 50 ఓవర్లలో 271/9 స్కోరు చేసింది. తన్మయ్ అగర్వాల్ (49), రోహిత్ తొలి వికెట్‌కు 78 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. రాహుల్ బుద్ది (41) మెరుగ్గా ఆడినా.. రెండో ఎండ్‌లో రాహుల్ సింగ్ (17), చందన్ సహానీ (0), రవి తేజ (17), తనయ్ త్యాగరాజన్ (4) ఫెయిలయ్యారు. శశాంక్ సింగ్, జీవేశ్ బుట్టే చెరో మూడు వికెట్లు తీశారు.
తర్వాత ఛేజింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్ 48.1 ఓవర్లలో 273/4 స్కోరు చేసి గెలిచింది. రిషబ్ తివారీ (65), సంజీత్ దేశాయ్ (47), హర్‌ప్రీత్ సింగ్ (38), అశుతోష్ సింగ్ (45 నాటౌట్), ఏక్‌నాథ్ కేర్కర్ (43 నాటౌట్), అమన్‌దీప్ ఖారె (26) నిలకడగా ఆడి టీమ్‌ను గెలిపించారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 2 వికెట్లు తీశాడు. గ్రూప్–బిలో హైదరాబాద్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ ఓటమితో 8 పాయింట్లతో మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నది.