
- ఉమ్మడి జిల్లాకు రూ.2.45 కోట్ల మంజూరు
- 1146 మంది రైతులకు లబ్ధి
- పదేండ్ల తర్వాత సబ్సిడీ పరికరాలు వస్తుండడంతో రైతుల్లో హర్షం
ఆసిఫాబాద్, వెలుగు: మహిళా రైతుల సాగుకు దన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం యాంత్రీకరణ స్కీమ్ ప్రవేశపెట్టింది. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కనీసం ఎకరం పట్టా భూమి ఉన్న మహిళా రైతులకు ఈ స్కీమ్ ను అందించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా1146 మంది మహిళా రైతులకు లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వం రూ.2.45 కోట్లు మంజూరు చేసింది.
మహిళల పేరిట పనిముట్లు
వ్యవసాయంలో మహిళా రైతుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లపాటు పాలించిన బీఆర్ఎస్ప్రభుత్వం మహిళా రైతులను పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అమలుకు దూరమైన యంత్రలక్ష్మి స్కీమ్‌ను యంత్రీకరణ పేరుతో మళ్లీ అమల్లోకి తీసుకొస్తోంది. మహిళా రైతులకు ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న ఈ పథకానికి గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ తుది దశకు చేరుకుంది. ఈనెల 25 వరకు గడువు ఉండగా పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. పట్టా పాస్ బుక్, ఆధార్, సాయిల్ హెల్త్ కార్డ్, రెండు ఫోటోలతో దరఖాస్తులు చేస్తున్నారు.
50 శాతం సబ్సిడీపై..
ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, బీసీ, ఇతరులకు 40 శాతం సబ్సిడీతో మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం అందించనుంది. ఇందులో హ్యాండ్ స్పేయర్లు, తేవాన్ స్పేయర్లు, డ్రోన్లు, స్పీడ్ మెషీన్లు, పవర్ ట్రిల్లర్లు, మొక్కజొన్న యంత్రాలు, పత్తి తీసే యంత్రాలు, కేజీ వీల్స్, కలుపు యంత్రాలు, గడ్డి కోసే మిషన్లు ఉన్నాయి. రోటవేటర్లు, బెడ్ మేకర్, డిస్క్ యంత్రాల కోసం అప్లై చేసుకునేవారికి ఆర్ సీ బుక్, లైసెన్స్ ఉండాలి. ఈనెల 25 నాటికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అర్హులైన వారికి వ్యవసాయ శాఖ అధికారులు ఈ పనిముట్లను అందించను న్నారు. ఈ పరికరాలు సరఫరా చేసేందుకు ఇప్పటికే కంపెనీలను నిర్ణయించారు.
దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగానే ఎంపిక చేస్తం
దరఖాస్తుల ప్రక్రియ పూర్తికాగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తం. జిల్లాలో మంజురైన యూనిట్లలో అన్ని మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నం. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత అర్హులైన వారిని గుర్తించి ట్రెజరీకి అందిస్తాం. దాని ప్రకారం సబ్సిడీ వస్తుంది. ఆ తర్వాత యంత్రాలు అందజేస్తం. - శ్రీనివాస్ రావు, డీఏవో, ఆసిఫాబాద్