- యూనిట్‌కు రూ.3.90 చొప్పున ఒప్పందం
- అన్నీ లెక్కేస్తే యూనిట్‌కు రూ. 5.64 ఖర్చు
- గత బీఆర్ఎస్ సర్కారు అసంబద్ధ నిర్ణయాలతో
- రాష్ట్ర ఖజానాపై 3,110 కోట్ల అదనపు భారం
- ఆశించిన స్థాయిలో జరగని విద్యుత్ సరఫరా
- బకాయిల విషయంలోనూ అస్పష్టతే
- జ్యుడీషియల్ ఎంక్వైరీలో తవ్వినకొద్దీ అక్రమాలు
హైదరాబాద్, వెలుగు: చత్తీస్‌గఢ్‌తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. తక్కువ రేటుకే కరెంట్కొంటున్నట్లు అగ్రిమెంట్లో చూపినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్ ధర రూ.3.90 అని చెప్పగా, అన్నీ లెక్కిస్తే యూనిట్ ఖర్చు 5.64కు చేరింది. దీంతో గత సర్కారు ఈ లెక్కలను దాచి, ప్రజల్ని మభ్యపెట్టినట్టు స్పష్టమవుతోంది. గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రానికి ఏకంగా రూ.6 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. తాజాగా చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కారు జ్యుడీషియల్ కమిషన్ వేయడంతో ఎంక్వైరీలో భాగంగా తవ్వినకొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
బకాయిల లెక్క తేలలే
కరెంట్‌ను ఒకవైపు ఎక్కువ ధరకు కొని.. తక్కువ అని చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. బకాయిల లెక్క సైతం తేల్చలేకపోయింది. దీంతో ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. రూ.1,081 కోట్ల బకాయిలున్నట్టు తెలంగాణ చెబుతుండగా, తమకు ఇంకా రూ.1,715 కోట్లు రావాల్సి ఉందని చత్తీస్ గఢ్ విద్యుత్తు సంస్థలు లెక్కలు చూపిస్తున్నాయి. ఈ వివాదంపై చత్తీస్‌గఢ్ ఇప్పటికే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి తెలంగాణకు చత్తీస్ గఢ్ విద్యుత్ 2017 చివరి నుంచి అందుబాటులోకి వచ్చింది. కానీ ఏ రోజు కూడా అక్కడి నుంచి వెయ్యి మెగావాట్ల కరెంట్ సాఫీగా రాలేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా 2017 నుంచి 2022 వరకు రూ.2,083 కోట్లు అదనపు భారం పడింది. కాగా, 2022 ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అవగాహనలేని ఒప్పందాలతో మరింత నష్టం
చత్తీస్ గఢ్‌నుంచి విద్యుత్‌ను తెచ్చుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) తో 1000 మెగావాట్ల సరఫరాకు కారిడార్ బుక్ చేసింది. ఈ కారిడార్ కూడా రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల కొంపముంచింది. బుకింగ్ అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ తెచ్చుకున్నా.. తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్ కు సరఫరా చార్జీలు చెల్లించాల్సిందే. దీంతో కరెంట్తెచ్చుకోకున్నా అదనంగా రూ.638 కోట్ల చార్జీలు చెల్లించారు. దీనికి తోడు గత ప్రభుత్వం నిర్వాకంతో కారిడార్ల బుకింగ్ పేరిట మరింత నష్టం వాటిల్లింది.
కేవలం 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతుండగా.. అనవసరంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అడ్వాన్స్‌గా కారిడార్ ను అప్పటి ప్రభుత్వం బుక్ చేసింది. ఆ తర్వాత చత్తీస్‌గఢ్ నుంచి ఆ స్థాయిలో విద్యుత్ లభించే అవకాశం లేదని కారిడార్ ను అర్ధంతరంగా రద్దు చేసుకుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగింది. పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని డిస్కంలకు పీజీసీఐఎల్ నోటీసులు జారీ చేసింది. పైగా ఈ విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి ఇప్పటివరకు తెలంగాణ ఈఆర్సీ ఆమోద ముద్ర వేయనే లేదు. ఇలా ఈఆర్సీ ఆమోదం లేకుండా చత్తీస్ గఢ్ కు చెల్లించిన వేల కోట్ల రూపాయలన్నీ అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాల్సి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
చెప్పింది ఒకటి..జరిగింది మరొకటి
చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ ఇప్పటివరకు 17,996 మిలియన్ యూనిట్ల కరెంట్ కొన్నది. ఇందుకోసం ఇప్పటివరకు రూ.7,719 కోట్ల చెల్లింపులు చేసింది. చత్తీస్‌గఢ్‌కు ఇంకా రూ.1,081 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కారు లెక్కతేల్చింది. దీనికితోడు ట్రాన్స్మిషన్ లైన్చార్జీలు రూ. 1,362 కోట్లు అయ్యాయి. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్ ఖర్చు రూ.5.64కు చేరింది. ఈ మూడు అంశాలను చూసినా రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ.3,110 కోట్ల అదనపు భారం పడినట్లు స్పష్టమవుతోంది.