- పట్టణ ప్రగతికి రూ. 6100 కోట్లు : మంత్రి కొండా సురేఖ
- అజాంజాహి మిల్లును కాపాడాలి : ఎమ్మెల్సీ సారయ్య
- విలీన గ్రామాలకు నిధులివ్వండి: ఎమ్మెల్యే నాగరాజు
- 23 అంశాలు రూ. 65.8 కోట్ల అభివృద్ధి పనులకు బల్దియా కౌన్సిల్ ఆమోదం
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. పట్టణ ప్రగతికి రూ. 6100 కోట్లను మంజూరు చేశారని తెలిపారు. బుధవారం నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రూ. 6100 నిధులే కాకుండా బల్దియాలో పెండింగ్లో పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించేందుకు సీఎం రూ.187 కోట్లు మంజూరు చేశారన్నారు.
కౌన్సిల్ సమావేశంలో ప్రతి కార్పొరేటర్ తమ సమస్యలు తెలిపేందుకు అవకాశం కల్పించామని, వారి డివిజన్ కు చెందిన సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్టీలకు అతీతంగా ఇటీవల ప్రతి డివిజన్ కు అభివృద్ధికి రూ.30 లక్షలు కేటాయించగా, పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి డివిజన్ కు నిధుల లభ్యతను బట్టి అభివృద్ధి నిమిత్తం నిధులు మంజూరు చేయాలని మేయర్ ను కోరారు.
అధికార, ప్రతిపక్షాలకు వాగ్వాదం..
బల్దియా కౌన్సిల్ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యులకు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం, సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ లేదని నినాదాలు చేశారు. నిధుల మంజూరులో తేడాలు చూపిస్తున్నారని మండిపడ్డారు. అధికార పక్ష సభ్యులు సైతం వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది.
ఇటీవల మరణించిన మాజీ ప్రధాని స్వర్గీయ డా.మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలుపుతూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో 23 ఎజెండా అంశాలకు రూ.65.8 కోట్ల అభివృద్ధి పనులకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బల్దియా ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అజాంజాహి మిల్లు స్థలాన్ని కాపాడాలి..
అజాంజాహి మిల్లు భవన నిర్మాణ అంశంపై తీసుకున్న చర్యలకు అధికారులు వివరణ ఇవ్వాలని, మిల్లు స్థలాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ సారయ్య కోరారు. కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే వివరణ ఇస్తూ అక్రమ నిర్మాణం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, భవన నిర్మాణ అనుమతులను రద్దు చేస్తూ నోటీసులు జారీ చేయగా, వారు కోర్టుకు ఆశ్రయించారని, ప్రస్తుతం ఈ సమస్య కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ అంశంపై రెవెన్యూ శాఖ వారి సహకారం కావాలని కమిషనర్ కోరారు.
విలీన గ్రామాలకు నిధులివ్వండి..
నగర పాలక సంస్థ పరిధిలో వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన 31 గ్రామాలు విలీన మైనందున ఆయా గ్రామాల నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించేందుకు కౌన్సిల్ ద్వారా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు.
పలువురు కార్పొరేటర్లు ఆయా డివిజన్లకు సంబంధించిన అనధికారిక నిర్మాణాలు, దోమల నివారణ వీధి దీపాలు సరిగా వెలగక పోవడం కుక్కల బెడద తదితర సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత విభాగాల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రిజ్వాన మసూద్ షమీం, కార్పొరేట్లతోపాటు బల్దియాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.