దశాబ్దాల కాలం పాటు ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన గర్జన సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యతిధిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
సామాన్యులపై పోలీసు కేసులు పెట్టడంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సిద్ధహస్తుడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికారం వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి, కేటీఆర్ లను కరీంనగర్ జైల్లో పెడుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం మొదలైందని..ఆ నాయకులను కాపాడుకోవడానికి పదవులను ఎరవేస్తోందని ఎద్దేవా చేశారు. తాను 26 సంవత్సరాలు ఎస్పీగా పని చేశానని...వేలాది మందికి విముక్తి కల్పించిన చరిత్ర తనదన్నారు. తనతో అనవసరంగా తలగోక్కోవద్దని హెచ్చరించారు.
హుజురాబాద్ బీఎస్పీ ఇంచార్జ్ గా వాసాల రామస్వామిని నియమిస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రామస్వామి ఇక్కడి నుండి జెడ్పీటీసీగా పోటి చేయబోతున్నాడని చెప్పారు.