
ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద స్కీంలు, హామీలు అమలు చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల కోసమే గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని... గృహలక్ష్మి పథకంతో ప్రజలకు లాభం జరిగే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ నెల రోజుల్లో వస్తుంది కాబట్టి..ముఖ్యమంత్రికి ఎన్నికల హామీలు గుర్తొచ్చాయని విమర్శించారు. తెలంగాణలో హోం మినిస్టర్ ఉన్నాడా లేడా.. అనే అనుమానం కలుగుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంఘసేవకులకు.. అమ్మాయిలకు రక్షణ లేదని మండిపడ్డారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరిగేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కమీషన్ల కోసమే తుమ్ముడిహెట్టి ప్రాజెక్టును తరలించారని ఆరోపించారు, వార్దా ప్రాజెక్టు అని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు .అధికారులను స్థానిక ఎమ్మెల్యే తిప్పలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పి నేతలతో మాట్లాడినా.. కలసినా అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీల ఆగడాలను ప్రజలంతా గమనిస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.