లేబర్ కోడ్లను​రద్దు చేయాల్సిందే: ఆర్టీసీ ఉద్యోగులు

లేబర్ కోడ్లను​రద్దు చేయాల్సిందే: ఆర్టీసీ ఉద్యోగులు

బ్లాక్ డే పాటించిన ఆర్టీసీ ఉద్యోగులు
బస్​ భవన్, అన్ని డిపోలు, బస్ ​స్టేషన్లలో నిరసనలు

హైదరాబాద్, వెలుగు: దేశంలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ లను తీసుకురావడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం బ్లాక్ డే పాటించారు. అన్ని ఆర్టీసీ డిపోలలో, బస్​ స్టేషన్లలో లేబర్ కోడ్ కాపీలను దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. 

లేబర్ కోడ్​లను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్​తో టీజీఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం రాష్ట్రవ్యాప్త బ్లాక్ డేకు పిలుపునిచ్చింది. దీనిని తెలంగాణ అంతటా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పూర్తి స్థాయిలో  విజయవంతం చేశారని టీజీఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి చెప్పారు. 

హైదరాబాద్​లోని బస్ భవన్ వద్ద ఎస్ డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, ఎస్‌‌‌‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి డ్యూటీలకు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యాలకు అనుకూలమైన, కార్మికులకు వ్యతిరేకమైన ఈ చట్టాలను రద్దు చేసేదాకా ఉద్మమిస్తామని హెచ్చరించారు. ఈ కోడ్ అమల్లోకి వస్తే యాజమాన్యం దయాదాక్షిణ్యాలతోనే కార్మికులు బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.