
- ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించాలి
- ఆర్టీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం
హైదరాబాద్, వెలుగు: సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే..మే7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు స్పష్టం చేశారు. మంగళవారం హిమాయత్ నగర్ ఏఐటీయూసీ ఆఫీస్లో టీజీఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వ హామీలు, ఆర్టీసీలో సమ్మె అంశాలపై జాతీయ కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం.నరసింహ మాట్లాడుతూ.. సమ్మెపై జేఏసీ ఇచ్చిన నోటీసులకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
అందుకే సమ్మెఅనివార్యమని భావిస్తూ ఆర్టీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసిందని తెలిపారు. సమ్మె నోటీసుపై జేఏసీతో చర్చలు జరపకుండా కార్మికులను రెచ్చగొడుతున్నారన్నారు. అందుకు యాజమాన్యం, ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పదేండ్లలో 16 వేల మంది పదవీ విరమణ చేసినా.. ఆ పోస్టులను ఇంకా భర్తీ చేయలేదన్నారు. 1200 బస్సులను తగ్గించి వాటి స్థానంలో ప్రైవేట్ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చారని ఆరోపించారు. ఆర్టీసీ సంస్థనే ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసేలా సబ్సిడీ అందజేయాలని డిమాండ్ చేశారు.