
నవాబుపేట, వెలుగు: మండలంలోని యన్మన్గండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రుక్కంపల్లి గ్రామస్తులు ఆదివారం తాగునీటి కోసం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో 15 రోజులుగా నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. నీరటి రాంచంద్రయ్య, చెన్నయ్య, రాములు, బుచ్చయ్య, కేశవులు, మహిళలు పాల్గొన్నారు.