పదేండ్లూ బీఆర్ఎస్ నిర్బంధ పాలన : ఆర్. భూపతి రెడ్డి

పదేండ్లూ  బీఆర్ఎస్ నిర్బంధ పాలన : ఆర్. భూపతి రెడ్డి

సిరికొండ, వెలుగు: బీఆర్ఎస్​హయాంలో పదేండ్లూ నిర్బంధ పాలన కొనసాగిందని,  ప్రస్తుతం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ఇందిరమ్మ పాలన సాగుతుందని రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ముషీర్ నగర్, మెట్టు మర్రి తండా, గడ్కోల్, గోప్య తండా, కొండాపూర్, హుస్సేన్ నగర్, తాళ్ల రామడుగు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడ్కోల్ గ్రామంలో ని కప్పల వాగు పై రూ.2.46 కోట్లతో చెక్ డ్యాం, లోంక రోడ్డుపై బ్రిడ్జికి రూ.3 కోట్లు, పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలకు ప్రహరీల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశామన్నారు.  

గడ్కోల్ గ్రామంలో రూ.3.10 కోట్లతో డబుల్ రోడ్డును ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, తడిసిన ధాన్యాన్ని  పరిశీలించారు.  రాష్ట్రం బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణను పార్లమెంటుకు పంపిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల 21ప్యాకేజ్ మంచిప్ప రిజర్వాయర్ ద్వారా రెండు నెలల్లో సాగునీటిని అందిస్తామన్నారు. అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.  కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెల్మా భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, మండలాధ్యక్షుడు బాకారం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, నాయకులు దేగం సాయన్న, జనార్దన్, నర్సారెడ్డి    పాల్గొన్నారు.