స్పేస్​లో రష్యా సొంత స్టేషన్

స్పేస్​లో రష్యా సొంత స్టేషన్

2024 కల్లా స్పేస్ స్టేషన్ సిద్ధం
ఐఎస్ఎస్ పని అయిపోయిందటున్న రష్యా

స్పేస్​లో రష్యా తనకంటూ ఓ సొంత గూడు కట్టుకునేందుకు సిద్ధమైపోతోంది! అంతరిక్ష ప్రపంచంలో ఆస్ట్రోనాట్లు ఉండేందుకు, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇప్పటికే ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​(ఐఎస్​ఎస్​) ఉన్నా.. దాని పని​అయిపోయిందని రష్యా అంటోంది. దాని వల్ల భవిష్యత్​లో పెను ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే మరో మూడేళ్లలో తన సొంత గూడును సిద్ధం చేసుకుని.. అంతరిక్షంలోకి పంపేందుకు చకచకా పనులు కానిచ్చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా స్పేస్​ ఏజెన్సీ రాస్కాస్మోస్​ చీఫ్​ దిమిత్రీ రొగోజిన్​ వెల్లడించారు. 

వయసు మళ్లిన ఐఎస్​ఎస్​

ఒకప్పుడు స్పేస్​ ప్రయోగాల్లో రష్యానే రారాజుగా ఉండేది. అంతరిక్షంలోకి తొలి ఆస్ట్రోనాట్​ను పంపిన దేశమది. ఎన్నెన్నో ఉపగ్రహాలను పంపి తనకు తిరుగులేని ముద్ర వేసుకుంది. కానీ, అంతరిక్ష ప్రపంచంలోకి అమెరికా అడుగు పెట్టాక, నాసా ప్రయోగాలు స్టార్ట్​ చేశాక ఆ దేశం ఘనత కొద్దికొద్దిగా తగ్గిపోతూ వచ్చింది. ఈ క్రమంలోనే అంతరిక్ష పరిస్థితులను తెలుసుకునేందుకు ఐఎస్​ఎస్​ అనే ఓ వేదికను నాసా ఏర్పాటు చేసింది. అందులో రష్యా సహకారమూ ఉందనుకోండి. రష్యా ఒక్కటే కాదు, జపాన్​, కెనడా, యూరప్​ దేశాలూ తలో చెయ్యి వేశాయి. అయితే, 1998లో పంపిన ఐఎస్ఎస్​ వయసు మీదపడిపోతోంది. ఇప్పటికే 23 ఏండ్లు నిండాయి. నిజానికి 15 ఏండ్ల నుంచి 30 ఏండ్ల కాలపరిమితితోనే ఐఎస్​ఎస్​ను ఏర్పాటు చేశారు.
  
ఐఎస్​ఎస్​తో డేంజర్​ అని

రష్యాకు ఇప్పుడు అదే ఆందోళన పట్టుకుంది. దాని కాలపరిమితి దగ్గరపడుతుండడంతో తనకంటూ కొత్తగా స్పేస్​ స్టేషన్​ను ఏర్పాటు చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన పనులనూ మొదలుపెట్టేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2024లో తన సొంత స్పేస్​ ఇంటిని నింగిలోకి పంపాలని టార్గెట్​గా పెట్టుకుంది. ‘‘ఐఎస్​ఎస్​ పని దాదాపు అయిపోయింది. ఇప్పటికే దానిని పంపించి 23 ఏండ్లు. వాస్తవంగా దానిని తక్కువలో తక్కువ 15 ఏండ్లకే డిజైన్​ చేశారు. గరిష్ఠంగా 30 ఏండ్లు. పాతబడిపోయిన ఐఎస్​ఎస్​తో ఆస్ట్రోనాట్ల ప్రాణాలకే ప్రమాదం. తెలిసితెలిసీ మేం ఆస్ట్రోనాట్ల ప్రాణాలను పణంగా పెట్టలేం. అందుకే 2024 నాటికి మా సొంత స్పేస్​ స్టేషన్​నే వాడుకుంటాం’’ అని రాస్కాస్మోస్​ చీఫ్​ చెప్పుకొచ్చారు. 

5 మాడ్యూల్స్​తో..

ప్రస్తుతం ఐఎస్​ఎస్​లో 16 మాడ్యూల్స్​ ఉన్నాయి. అందులో అమెరికావి 9 ఉంటే.. రష్యాకు చెందినవి నాలుగున్నాయి. ఆ తర్వాత రెండు జపాన్​ మాడ్యూళ్లు, ఒకటి యూరప్​ మాడ్యూల్​ ఉంది. భవిష్యత్​లో ఐఎస్​ఎస్​కు కమర్షియల్​ మాడ్యూల్స్​నూ అటాచ్​ చేసే ప్రతిపాదనలున్నాయి. అందులో ఒకటి నాసాకు చెందిన కమర్షియల్​ పార్ట్​నర్​ యాగ్జియం స్పేస్​ ఏర్పాటు చేయనుంది. అయితే, ఇప్పడు రష్యా పంపాలనుకుంటున్న స్పేస్​ స్టేషన్​లో మొదటి దశలో ఐదు మాడ్యూళ్లు ఉండనున్నాయి. అందులో ఒకటి కమర్షియల్​ మాడ్యూల్​. నలుగురు టూరిస్టులకు చోటు ఉండేలా కమర్షియల్​ మాడ్యూల్​ను తయారు చేస్తున్నారు.  

గూఢచర్యం ఆరోపణలతో..

ఐఎస్​ఎస్‌పై రష్యా కుట్రకు పాల్పడిందంటూ కొద్ది నెలల కిందట అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఐఎస్​ఎస్​ మాడ్యూల్​కు డ్యామేజీని రష్యానే చేసిందని, అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి గూఢచర్యానికీ పాల్పడిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే రష్యా సొంతంగా ఒక స్పేస్​ స్టేషన్​ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఐఎస్​ఎస్​ చాలా ప్రమాదకరంగా మారుతోందని, దానిని నమ్ముకోలేమని రష్యా ఉప ప్రధాని యూరీ బోరిసోవ్​ ఇటీవలే వ్యాఖ్యానించారు. దానితో పెను విపత్తు పొంచి ఉందని హెచ్చరికలూ చేశారు. 

పాత స్పేస్​ స్టేషన్​ మోడలే స్ఫూర్తి..

రష్యా 1986లో పంపిన తొలి స్పేస్​ మాడ్యూల్​ మీర్​ స్పేస్​ స్టేషన్​ నమూనా ఆధారంగానే కొత్త స్పేస్​ స్టేషన్​ను నిర్మిస్తోంది. 2001 వరకు మీర్​ స్పేస్​ స్టేషన్​ సేవలందించింది. 2024లో అంగారా ఏ5 రాకెట్​ ద్వారా ప్లెసెస్క్​ లేదంటే వోస్టోక్నీ అనే కాస్మోడ్రోమ్​ల నుంచి కొత్త స్పేస్​ స్టేషన్​ను పంపేందుకు ప్లాన్లను సిద్ధం చేసి పెట్టుకుంది. రష్యా స్పేస్​ స్టేషన్​కు తోడుగా చైనా లార్జ్​ మాడ్యులార్​ స్పేస్​ స్టేషన్​ కూడా రెడీ అవుతోంది. లో ఎర్త్​ ఆర్బిట్​లో వాటిని ప్రవేశపెట్టనున్నారు. అయితే, ప్రస్తుతం ఐఎస్​ఎస్​ బరువులో రష్యా పంపాలనుకుంటున్న స్పేస్​ స్టేషన్​ బరువు కేవలం ఐదో వంతు.