- కీవ్, ఎల్వివ్ నగరాలే లక్ష్యంగా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం కురిపించింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన దాడులు ఆదివారం ఉదయం వరకు కొనసాగాయి. కీవ్, ఎల్వివ్ నగరాలను లక్ష్యంగా చేసుకుని మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. మాస్కోలో జరిగిన ఉగ్రదాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో దాడులు ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది. రష్యా ప్రయోగించిన కొన్ని మిసైళ్లు.. తమ ఎయిర్‌స్పేస్ నుంచి వెళ్లినట్టు పోలెండ్ ప్రకటించింది.
ఉక్రెయిన్‌కు చెందిన ఇవానివ్ స్కే గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రష్యన్ మిలిటరీ తెలిపింది. రష్యా దాడులు ముమ్మరం చేసిందని, అప్రమత్తంగా ఉండాలని కీవ్ మేయర్ ప్రజలను హెచ్చరించారు. షెల్టర్స్ నుంచి ఎవరూ బయటికి రావొద్దని సూచించారు. రష్యా మొత్తం 29 క్రూజ్ మిసైల్స్, 28 డ్రోన్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. వాటిలో 18 మిసైల్స్‌ను, 25 డ్రోన్లను కూల్చేసినట్టు ప్రకటించింది.