SA20 2024: వరుసగా రెండో సారి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్ రైజర్స్

SA20 2024: వరుసగా రెండో సారి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్ రైజర్స్

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టాప్ క్లాస్ ఆట తీరును ప్రదర్శించింది. క్వాలిఫైయర్‌ 1లో విజయం సాధించడం ద్వారా ఫైనల్ కు చేరుకుంది. డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో సారి ఫైనల్ కు దూసుకెళ్లింది. నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన  ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టి ఈ టోర్నీలో ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. 2023 దక్షిణాఫ్రికా టీ20 లీగ్ టైటిల్ ను సన్‌రైజర్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్మాన్, మలాన్ తొలి వికెట్ కు 45 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఓపెనర్ మలాన్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ జట్టుకు డీసెంట్ టోటల్ అందించాడు. మార్కరం 30 పరుగులు చేసి పర్వాలేదనించాడు. డర్బన్ సూపర్ జయింట్స్ బౌలర్లలో మహారాజ్, జూనియర్ డాల చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. నవీన్ ఉల్ హక్, ప్రిటోరియస్ కు తలో వికెట్ లభించింది. 

ఒక మాదిరి లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన డర్బన్ 106 పరుగులకే కుప్ప కూలింది. సన్ రైజర్స్ బౌలర్స్ ధాటికి ఏ దశలోనూ  లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. డికాక్(20), మల్డర్(380, క్లాసన్(23) మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.మార్కో జాన్సెన్, బార్ట్ మెన్ చెరో నాలుగు వికెట్లతో డర్బన్ లైనప్ ను కుప్ప కూల్చారు. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన బార్ట్ మెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫిబ్రవరి 10 న శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.