నిద్రమత్తులో ఎక్సైజ్.. జోరుగా కొనసాగుతున్నా కల్తీ కల్లు విక్రయాలు

బోధన్, వెలుగు:  బోధన్​ డివిజన్​లోని గ్రామాలలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.  ప్రమాదకరమైన క్లోరల్​హైడ్రెట్ రసాయనాలతో కృత్రిమ కల్లును తయారు చేసి  విక్రయిస్తున్నారు. కల్లు ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకొని  విక్రయదారులు కల్తీకల్లును తయారు చేసి ఎక్కువ ధరకు విక్రయించి అందినకాడికి  దండుకుంటున్నారు. వేల లీటర్ల కల్తీ కల్లును తయారు చేసి కల్లు బట్టీలకు సరఫరా చేస్తున్నారు. కొంతమంది నిర్వాహకులైతే  కల్తీ కల్లును అటోలలో మహారాష్ట్రకు  కూడా సరఫరా చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులతో కుమ్మకై  లక్షలు సంపాదిస్తున్నారు.  గ్రామాలలో ప్రజలు కల్తీ కల్లుకు బానిసలైపోతున్నారు. కల్తీ కల్లు తాగినవారు రోడ్లపై హంగామా సృష్టిస్తూ, ప్రయాణికులకు ఇబ్బందులు కల్గిస్తున్నారు.

కల్తీ కల్లును అరికట్టాలని ధర్నా

 కల్తీకల్లును అరికట్టాలని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు  ఎక్సైజ్ ఆఫీసు  ఎదుట ఆరు నెలల క్రితం  ధర్నా  చేశారు.  బోధన్  ఏసీపీ కిరణ్​కుమార్​కు  వినతిపత్రం  అందించారు. కొంతమంది ఎక్సైజ్​ సీఐతో వాగ్వివాద్వానికి  దిగారు.  కృత్రిమ కల్లును తాగిన ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారని, దీనిని అరికట్టాలని డిమాండ్​ చేశారు. అయినా ఎక్సైజ్ అధికారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని   ఆరోపిస్తున్నారు. కల్తీకల్లు విక్రయదారుల వద్ద ప్రతినెలా మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని  స్థానికులు ఆరోపిస్తున్నారు.

పట్టించుకోని ఎక్సైజ్​ అధికారులు 

కల్తీ కల్లును తాగిన ప్రజలు రోడ్లుపై ఎక్కడిపడితే అక్కడ  పడిపోతున్నారు. గంటల కొద్దీ రోడ్లపై రాకపోకలకు ఇబ్బంది కల్గిస్తున్నారు.  ఎక్సైజ్​అధికారులకు స్థానికులు ఫోన్​చేసినా పట్టించుకోవడం లేదు. ప్రమాదకరమైన రసాయనాలతో తయారుచేసి  విక్రయిస్తున్నారని ఫ్యిరాదు చేసినా, నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్తీకల్లుకు బానిసైన వారు కళ్లు తిరిగి పడిపోవడం,  ఫిట్స్​ రావడం, మతిస్థిమితం కోల్పోయి  ఆస్పత్రుల పాలవుతున్నారు. 


కల్తీకల్లుపై  చర్యలు తీసుకుంటాం

బోధన్​ నియోజకవర్గంలో కల్తీకల్లు  తయారు చేయకుండ చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కల్లు తయారీ కేంద్రాలపై నిఘా పెట్టాం.  తనిఖీలు చేసి, కల్తీకల్లు తయారుచేసే  వారిపై  తీసుకుంటాం.

   ఎక్సైజ్​ సీఐ  రూప్​సింగ్​.