నాడు కళకళ.. నేడు వెలవెల శిథిలావస్థలో సంగారెడ్డి జిల్లా జైలు మ్యూజియం

నాడు కళకళ.. నేడు వెలవెల శిథిలావస్థలో సంగారెడ్డి జిల్లా జైలు మ్యూజియం
  • 'ఫీల్ ద జైల్' అనే కాన్సెప్ట్​ ఇక్కడి నుంచే మొదలు
  • కనుమరుగు కానున్న 200 ఏళ్ల చరిత్ర 

సంగారెడ్డి, వెలుగు:దాదాపు 200 ఏళ్ల చరిత్ర గల సంగారెడ్డి జిల్లా జైలు బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ  జైలు భవంతి ఇప్పుడు కూలడానికి సిద్ధంగా ఉంది. ఎంతోమంది కరుడుగట్టిన నేరగాళ్లు ఈ జైలు గోడల మధ్య శిక్ష అనుభవించారు. 2018లోనే అప్పటి ప్రభుత్వం ఇక్కడి జైలును కందికి షిప్ట్​చేయడానికి ప్రతిపాదనలు పంపగా కొత్తగా 42 ఎకరాల్లో జైలు ప్రాంగణం నిర్మించారు. పాత జైలు బిల్డింగ్ ను అప్పటి అధికారులు హెరిటేజ్ మ్యూజియంగా తీర్చిదిద్దారు. అలాంటి చరిత్ర గల ఈ జైలు మ్యూజియం ఇప్పుడు  ఆలనా పాలన లేక శిథిలావస్థకు చేరి నేడో రేపో కూలిపోయే పరిస్థితికి వచ్చింది.

జైలు మ్యూజియంగా..

సంగారెడ్డి పాత బస్టాండ్ వెనకాల ఉన్న పాత జైలు కందికి షిప్ట్​కావడంతో ఆ బిల్డింగ్ ను అధికారులు​జైలు మ్యూజియంగా ఏర్పాటుచేశారు. జైళ్ల శాఖ అప్పటి డీజీ వి.కే.సింగ్ నేతృత్వంలో 'ఫీల్ ద జైల్' అనే కాన్సెప్ట్ తో మొదటిసారి ప్రపంచానికి ఒకరోజు జైలు జీవితం గడిపేందుకు అవకాశం కల్పించారు. దీనికి రూ.500 ఎంట్రీ ఫీజు పెట్టి సక్సెస్ అయ్యారు. 

దేశ నలుమూలల నుంచి ఎంతోమంది యువకులు, ప్రముఖులు, సినీ యాక్టర్లు ఇక్కడికి వచ్చి ఫీల్ ద జైల్ లో భాగంగా ఒకరోజు జైలు జీవితాన్ని గడిపి తమ అనుభవాలను పంచుకున్నారు. అదే టైంలో ఇందులోనే ఆయుర్వేదిక్ విలేజ్ పేరుతో ప్రాచీన కేరళ వైద్య శిబిరాన్ని ప్రజలకు పరిచయం చేసి కొంతకాలం విజయవంతంగా నడిపారు. కొన్నేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన ఈ జైలు మ్యూజియం ఆ తర్వాత సరైన  నిర్వాహణ, ఆదరణ లేకపోవడంతో నేడు శిథిలావస్థకు చేరింది.

జాతి రత్నాలు సినిమాలో..

యువతను ఎంతో ఆకర్షించిన జాతి రత్నాలు సినిమాలో చిత్రీకరించిన ఫీల్ ద జైల్ సన్నివేశాలు ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. సంగారెడ్డి పాత జైలు మ్యూజియంలోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన ముగ్గురు యువకులు ఒకరోజు జైలు జీవితం గడపాలన్న కోరికతో సంగారెడ్డి పాత జైలుకు వచ్చి వారి అనుభవాలను పంచుకుంటారు. సినిమాలో ఈ సన్నివేశాలు బాగా పాపులర్ అయ్యాయి. ఇలా ఈ సినిమా మాత్రమే కాకుండా ఇక్కడ ఎన్నో సినిమా షూటింగులు జరిగాయి. 

సందర్శకుల తాకిడితో నిత్యం సందడిగా ఉండేది. సరికొత్త ఆలోచనలు, విధానాలతో జైలు మ్యూజియంను ముందుకు నడిపించిన జైళ్ల శాఖ ఇప్పుడు పట్టించుకోవడంలేదనే  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా షూటింగులు, ప్రాచీన కేరళ వైద్య కేంద్రం నిర్వహణ ఇతరత్రా కార్యక్రమాలతో జైళ్ల శాఖకు ఈ పాత జైలు మ్యూజియం ద్వారా ఆదాయం బాగానే వచ్చింది. ప్రభుత్వం ఈ జైలు మ్యూజియానికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల నిర్ణయమే ఫైనల్​

హెరిటేజ్ జైలు మ్యూజియం నిర్వహణపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అది మా కంట్రోల్​లో లేదు. జైళ్ల శాఖ డీఐజీ పర్యవేక్షణలో ఉంది. ఈ మ్యూజియం వల్ల ఒకప్పుడు జైళ్లశాఖకు బాగా పేరొచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. ఒకవేళ మ్యూజియంను తిరిగి కొనసాగించాలన్న లేదా అక్కడ మరే ఇతర కార్యకలాపాలు నిర్వహంచాలన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందే.- సంతోష్ రాయ్, సూపరింటెండెంట్ జిల్లా జైలు