
మెదక్, సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్, మెదక్ జిల్లా వనదుర్గ(ఘన్పూర్) ప్రాజెక్ట్ సాగునీటి దినోత్సవాలకు నోచుకోలేదు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా అన్ని ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల పరిధిలో ధూంధాంగా ఉత్సవాలు జరిగాయి. చెక్‌డ్యామ్ లు, ప్రాజెక్టులకు డెకరేషన్ చేసి, బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపులు నిర్వహించారు. కానీ ఈ ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడా ఇరిగేషన్ అధికారులు వేడుకలు జరపలేదు. సింగూరు కాల్వల పనులు పెండింగ్‌లో ఉండడం, వనదుర్గ ప్రాజెక్టు ఎత్తుపెంపు పనులు మొదలు పెట్టకపోవడంతో జనాల నిరసనలు, నిలదీతలు ఎదుర్కోవలసి వస్తుందన్న అనుమానంతోనే వేడుకకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఫండ్స్ మంజూరైనా ఎత్తుపెంచలే
మెదక్ జిల్లాలో కొల్చారం, పాపన్నపేట మండలాల సరిహద్దులో ఉన్న వనదుర్గ ప్రాజెక్ట్ (ఘనపూర్ ఆనకట్ట) ఎత్తు పెంపు పనులు ఎనిమిదేండ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతామని స్వయంగా సీఎం కేసీఆర్ప్రాజెక్ట్ దగ్గరకొచ్చి హామీ ఇచ్చారు. ఈ పనులకు రూ.43.64 కోట్లు మంజూరయ్యాయి. దాంతో 2015 మేలో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావుఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు శంకుస్థాపన చేశారు. ఆనకట్ట దిగువన సపోర్టుగా చేపట్టిన ఆఫ్రాన్ నిర్మాణం మాత్రమే జరిగింది. ప్రధానమైన ఆనకట్ట ఎత్తుపెంచే పనులు మొదలే కాలేదు.
ఆనకట్ట ఎత్తు పెంచడంవల్ల ముంపునకు గురయ్యే పాపన్నపేట, కొల్చారం మండలాల్లోని భూముల పరిహారం కోసం రూ.8 కోట్లు ప్రభుత్వం గతేడాది మార్చిలో మంజూరు చేసినా, అమౌంట్ రిలీజ్ కాలేదు. భూసేకరణ ప్రక్రియ పెండింగ్ లో ఉండటం వల్ల పనులకు బ్రేక్ పడింది. ఆనకట్ట ఎత్తు పెంచితే అదనంగా మరో 5 వేల ఎకరాలకు సాగునీరందుతుందని సంబరపడిన రైతులకు నిరాశే మిగిలింది. పాపన్నపేట మండల పరిధిలోని ఫతేనహర్ మెయిన్ కెనాల్, బ్రాంచ్ కెనాల్ పనులకు నిధులు మంజూరైనప్పటికీ పూర్తి కాలేదు. ఏడుపాయల ఆలయాన్ని అభివృద్ధి చేసి ఘనపూర్ ఆనకట్ట ప్రాంతాన్ని కలుపుతూ టూరిస్ట్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినా ఇంకా ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు.
అమీన్పూర్లో కూడా..
పటాన్ చెరు నియోజకవర్గం అమీన్‌పూర్‌లోని చెరువుల దగ్గర కూడా వేడుకలు జరగలేదు. అక్కడి చెరువులు, కుంటలు, నాలాలు బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసి రియల్ దందా చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఆక్రమణలపై కొంతకాలంగా ఇక్కడ రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో చెరువుల పండుగ నిర్వహిస్తే ప్రజల నుంచి విమర్శలు వస్తాయని బీఆర్ఎస్ లీడర్లు చెరువుల దగ్గరకు కూడా రాలేదంటున్నారు.
కాల్వల పనులు పెండింగ్
దాదాపు 45 వేల ఎకరాలకు సాగునీరు అందించే సింగూరు ప్రాజెక్ట్ దగ్గర అధికారులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ లీడర్ల సందడే కనిపించలేదు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ వద్ద 29.917 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన సింగూర్ ప్రాజెక్ట్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ప్రాజెక్టు నుంచి పొలాలకు సాగునీరందించేందుకు పూర్తిస్థాయిలో కాల్వల నిర్మాణం జరగలేదు. ఉన్న కాలువలు దెబ్బతినగా వాటిని రిపేర్ చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటితో సింగూరును నింపేందుకు ఉద్దేశించిన సంగారెడ్డి కాలువల పనులు ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. కాల్వల నిర్మాణం, రిపేర్లకు సంబంధించి ఏమిదేండ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసంతృప్తితో ఉన్న రైతులు ఎక్కడ నిలదీస్తారోనని అధికారులు వేడుకలపై మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది