- సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి టౌన్, వెలుగు : దివ్యాంగులకు ఉపాధి కల్పించడమే జాబ్ మేళా లక్ష్యమని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. బుధవారం జిల్లాలోని దివ్యాంగులకు ఉపాధి కల్పించడం కోసం జిల్లా ఉపాధి కల్పన శాఖ, మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన జాబ్ మేళాను కలెక్టరేట్ మీటింగ్హాల్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కార్పొరేట్ కంపెనీలు , ప్రైవేట్ సెక్టార్ కంపెనీల్లో వారి అర్హతల మేరకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు .
దివ్యాంగులు సాధారణ పౌరుల వలె మెరుగైన జీవితం గడపడం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. జాబ్ మేళాలో సుమారు 200 ఉద్యోగాలను కల్పించేందుకు 32 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు.
జిల్లాలో సుమారు ఐదువేల వరకు వివిధ రకాల కంపెనీలు ఉన్నట్లు తెలిపారు. వచ్చే నెలలో నిర్వహించే జాబ్ మేళాకు జిల్లాలోని అన్ని కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, యూత్ ఫర్ జాబ్స్ మేనేజర్ అశ్విన్ , వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.