
తాడ్వాయి, వెలుగు: సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరలో పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘం అని చెప్పాలి. ఈనెల 12, 13, 14 తేదీల్లో వనదేవతల (మండే మెలిగే )మినీ జాతర ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం జాతర ముగిసింది. అమ్మవార్లను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు కోళ్లు, మేకలను దేవతలకు మొక్కుకొని బలివ్వడం, వంట చేసుకోవడం, తినుబండారాలు వినియోగించడంతో జాతర పరిసరాలు జంతు కళేబరాలతో చెత్తతో నిండాయి. దీంతో ఎక్కడ కూడా ఎలాంటి చెత్త కనిపించకుండా రాజమండ్రి నుంచి వచ్చిన పారిశుధ్య కార్మికులు పనులు చేశారు.
నిరంతరం అన్ని ప్రాంతాల్లో తిరిగి చెత్త, వ్యర్థాలు లేకుండా శుభ్రం చేశారు. ఈ విషయంలో వారిని అధికారులు అభినందిస్తున్నారు. జాతరలో పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి గ్రామ పంచాయతీ అధికారులు రాజమండ్రి నుంచి 400వందల మంది కార్మికులను మేడారానికి తీసుకువచ్చారు. హెక్టరుకు 100 మంది చొప్పున నాలుగు టీములుగా విడిపోయి, షిఫ్టుల వారీగా నాలుగు రోజుల పాటు పారిశుధ్య పనులు చేశారు. వీరిలో అధికంగా మహిళా కార్మికులే ఉన్నారు.