![అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ఆధునిక శిక్షణ : సంజయ్ కుమార్](https://static.v6velugu.com/uploads/2025/02/sanjay-kumar-said-special-steps-are-being-taken-to-provide-training-with-advanced-technology_Sj3arc6Nq9.jpg)
నస్పూర్, వెలుగు: ఐటీఐలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ద్వారా అడ్వాన్స్డ్టెక్నాలజీతో శిక్షణ అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటీసీ సెంటర్ ను ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి, కలెక్టర్ కుమార్ దీపక్, ఉపాధి శిక్షణ సంస్థ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారా
మయ్య, మంచిర్యాల అర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి పరిశీలించారు.
సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐటీఐ కాలేజీలతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఏటీసీ సెంటర్ పనులను స్పీడప్ చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్రమేశ్, మంచిర్యాల, నస్పూర్ మండలాల తహసీల్దార్లు రఫతుల్లా, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.