ఎన్నికలు రాక ముందే సర్పంచ్​ ఏకగ్రీవం!

ఎన్నికలు రాక ముందే సర్పంచ్​ ఏకగ్రీవం!
  • 3 గుళ్లు కట్టించి, గడపకో  వెయ్యి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థి
  • మాటతప్పి వేరేవాళ్లు నామినేషన్​ వేస్తే.. రూ.50 లక్షల జరిమానా
  • గ్రామస్తుల సమక్షంలో ఒప్పంద పత్రం..విజయోత్సవ వేడుకలు 
  • వరంగల్​ జిల్లా చెరువుకొమ్ము తండాలో  ఘటన

పర్వతగిరి(వరంగల్)​, వెలుగు: రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్​రాలేదు. కానీ ఆ గ్రామంలో మాత్రం  సర్పంచ్​ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.  మూడు గుళ్లు కట్టించి, గడపకో రూ.వెయ్యి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు. అగ్రిమెంట్​రాసిన అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఈ  ఘటన జరిగింది. చెరువుకొమ్ము తండాలో  దాదాపు 883 మంది జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, తనను సర్పంచ్​గా ఏకగ్రీవం చేస్తే  సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మతల్లి, ఆంజనేయుడికి మూడు గుళ్లు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని,  బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు రూ.1000 చొప్పున పంచుతానని దరావత్​ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. 

Also Read:-ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోండి

ఇందుకోసం వచ్చే సర్పంచ్​ ఎన్నికల్లో ఎవరూ పోటీచేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్​పెట్టాడు. దీనికి ఒప్పుకున్న గ్రామస్తులు..సర్పంచ్​అయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తిచేస్తానని దరావత్​ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో సోమవారం ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్​ పెట్టి అగ్రిమెంట్​పేపర్​ రాసుకొని.. సర్పంచ్​ అభ్యర్థి, గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. 

 గడువులోగా పనులు పూర్తయితే.. కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్​ వేయాలని,  దీనిని అతిక్రమించి​ఎవరు నామినేషన్​ వేసినా బాలాజీకి రూ.50 లక్షలు జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్​లో రాసుకున్నారు. ఒప్పందపత్రంపై ఇరుపక్షాలవారు సంతకాలు చేయగానే సర్పంచ్​అభ్యర్థితోపాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని, వేడుకలు చేసుకున్నారు.