సత్తుపల్లి, వెలుగు : గంజాయి అమ్ముతున్న నలుగురిని సత్తుపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేంసూరు రోడ్ శివారులోని ఓ మామిడి తోటలో యువకులు గంజాయి అమ్ముతున్నారని పక్కా ఇన్ఫర్మేషన్తో పోలీసులు దాడి చేశారు. నలుగురు యువకులు పట్టుబడగా, ఇద్దరు పారిపోయారు. పట్టుబడిన వారిలో మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఆరుమల్ల తరుణ్ కుమార్, సిద్ధారం గ్రామానికి చెందిన జగం అఖిల్, రేజర్ల గ్రామానికి చెందిన కలపాల రాంబాబు, ఎన్టీఆర్ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం ఉన్నారు.
పరారీలో ఉన్నవారిలో రేజర్ల గ్రామానికి చెందిన జుంజ్జునూరి సింహాద్రి అలియాస్ సందీప్, వేంసూరు మండలం లింగపాలెం గ్రామానికి చెందిన శ్రీనాథ్ ఉన్నారు. నిందితుల నుంచి 111.29 గ్రాముల గంజాయి, రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా గంజాయి కొన్నా, అమ్మినా వారిపై పీడీ కేసులు నమోదు చేస్తామని కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ టీ.కిరణ్, ఎస్సై పి.రఘు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.