
- రూ.16 లక్షల విలువైన వాహనాలను అప్పగించిన ఎస్బీఐ చైర్మన్
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు సెట్టి రెండు బ్యాటరీ వాహనాలను అందజేశారు. సోమవారం ఫ్యామిలీతో కలిసి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన.. బ్యాటరీ వాహనాలకు సంబంధించిన తాళం చెవిలను ఆలయ ఈవో భాస్కర్ రావు అందజేశారు. అనంతరం ఈవో భాస్కర్ రావుతో కలిసి బ్యాటరీ వాహనాలకు జెండా ఊపి సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్ బీఐ చైర్మన్ మాట్లాడుతూ.. ఒక్కోటి రూ.8 లక్షలు విలువ చేసే రెండు బ్యాటరీ వాహనాలను ఎస్బీఐ తరఫున దేవస్థానానికి విరాళంగా అందజేశామని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు సెట్టి తెలిపారు. భవిష్యత్తులో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద ఇచ్చే విరాళాలు అందించడంలో యాదగిరిగుట్ట ఆలయానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. ప్రధానాలయ ముఖ మంటపంలో.. ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు.