- వీటి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది
- ఐడీబీఐలో వాటాల అమ్మకంపై బడ్జెట్‌లో చర్యలు!
- డిపాజిట్లను ఆకర్షణీయంగా మారిస్తే ఎకానమీకి మేలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాలను అమ్మడానికి కేంద్రానికి ఇదే మంచి సమయమని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకుల ఆర్థిక పరిస్థితి బాగుందని తెలిపింది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న బ్యాంకులను కలిపి పెద్ద బ్యాంకులను క్రియేట్ చేయాలని సలహా ఇచ్చింది. ప్రభుత్వం తన డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌ను కొనసాగించాలని ‘ప్రిల్యూడ్ టూ యూనియన్ బడ్జెట్ 2024–25’ పేరుతో రిలీజ్ చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది.
ఐడీబీఐ బ్యాంకులో 61 శాతం వాటా అమ్మాలని ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) చూస్తున్నాయి. ‘ఈ వాటాను అమ్మడానికి 2022 అక్టోబర్‌లో బిడ్స్‌ను ఆహ్వానించారు. జనవరి, 2023 లో బయ్యర్ల నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) బిడ్స్ అందుకుంది. ఈ అంశంపై రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందని అంచనా వేస్తున్నాం’ అని ఎస్‌బీఐ రిపోర్ట్ వివరించింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా, ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉంది.
డిపాజిట్ల వడ్డీపై ట్యాక్స్ తగ్గించాలి..
రానున్న బడ్జెట్‌లో ట్యాక్స్ రిలీఫ్స్ ప్రకటించాలని కూడా ఎస్‌బీఐ రిపోర్ట్ కోరింది. డిపాజిట్లపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ తొలగించడం లేదా తగ్గించడం చేయాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఒక వ్యక్తికి డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం ఏడాదిలో రూ.40 వేలు (అన్ని బ్యాంకుల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీ కలిపి) దాటితే 10 శాతం టీడీఎస్ వేస్తున్నారు. బ్యాంక్ పాన్ కార్డ్ ప్రొవైడ్ చేయకపోతే 20 శాతం టీడీఎస్ పడుతోంది. మిగిలిన అసెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ బయటకు తీసేశాక ట్యాక్స్ పడుతోందని, డిపాజిట్లపై మాత్రం పెట్టుబడులు బయటకు తీయకపోయినా పడుతోందని ఎస్‌బీఐ రిపోర్ట్ పేర్కొంది.
మిగిలిన అసెట్స్ మాదిరే డిపాజిట్లపై కూడా ట్యాక్స్ ప్రాసెస్ ఉండాలంది. కుటుంబాల సేవింగ్స్ 2022–23 లో జీడీపీలో 5.3 శాతానికి తగ్గాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 5.4 శాతంగా రికార్డవుతాయని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. డిపాజిట్ రేట్లను ఆకర్షణీయంగా మారిస్తే కుటుంబాల సేవింగ్స్ పెరుగుతాయని తెలిపింది. ప్రజల సేవింగ్స్ పెరిగితే వ్యవస్థలో వినియోగం ఊపందుకుంటుందని, జీఎస్‌టీ రెవెన్యూ పెరుగుతుందని వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, బ్యాంక్ డిపాజిట్లు పెరగడం వలన ఫైనాన్షియల్ సిస్టమ్‌లో స్టెబిలిటీ పెరగడమే కాకుండా కుటుంబాల సేవింగ్స్ కూడా నిలకడగా ఉంటాయి.
ఇతర అసెట్స్‌తో పోలిస్తే బ్యాంకుల్లో రిస్క్ తక్కువ కాబట్టి ప్రజలు బ్యాంకుల్లో తమ డబ్బులు సేవ్ చేసుకుంటారు. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) పై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎస్‌బీఐ రిపోర్ట్ సలహా ఇచ్చింది. ‘2023–24 లో ఐబీసీ కింద క్రెడిటర్లు 32 శాతం మాత్రమే రికవరీ చేసుకోగలిగారు. మిగిలిన 68 శాతం అమౌంట్‌ను లాస్ అయ్యారు. రిజల్యూషన్ పూర్తవ్వడానికి అనుకున్న 330 రోజులు బదులు 863 రోజులు పడుతోంది’ అని వెల్లడించింది.