విద్యాభివృద్ధికి కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ అభ్యసించే పాఠ్య, సహపాఠ్య అంశాలు విద్యార్థి శారీరక, మానసిక వికాసానికి పునాది వేస్తాయి. గత కొంత కాలంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రైవేట్ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంతో ఆధునికత వైపు వెళ్ళగా... ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు కొంత వెనకబడ్డాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరతనే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ బడుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులే అధిక సంఖ్యలో చదువుకుంటున్నారు. వీరికి ప్రభుత్వబడులే ఆధారం.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యా వ్యవస్థను చక్కదిద్దాలని పలువురు విద్య విద్యావేత్తలు కోరుకుంటున్నారు.
విద్యారంగానికి నామమాత్రంగా బడ్జెట్
పీఆర్ఎస్ ఇండియా 2023 ప్రచురించిన స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం...2023 –-24లో రాష్ట్రాలు తమ బడ్జెట్లో సగటును 14.7శాతం విద్యపై ఖర్చు చేస్తారని అంచనా వేయగా...తెలంగాణ మాత్రం 7.6 శాతం ఖర్చు చేస్తుందని అంచనా వేయబడింది. ఇది అత్యల్పంగా ఉందని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి 12 శాతం నిధుల కేటాయింపు జరిగేది. ఇప్పుడు మన రాష్ట్రం మాత్రం అతి తక్కువ నిధులు కేటాయించిన రాష్ట్రంగా దేశంలోనే నిలిచిపోయింది.
దుర్భరంగా మారిన గురుకులాలు
మరోవైపు విద్యారంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న పథకం గురుకులాలు ఏర్పాటుతో కేజీ టు పీజీ విద్య అందిస్తామని చెప్పారు. ఇవి కూడా సౌకర్యాల లేమితో అత్యంత దుర్భరమైన స్థితిలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కార్పొరేటు నిర్ణయాలతో విద్యా వ్యవస్థ అద:పాతాళానికి నెట్టబడింది. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థులు లేని కారణంగా 1,346 పాఠశాలలు మూతపడ్డాయి. గత ప్రభుత్వ విధానాలతో చదువుకోవాలంటే .. చదువులు కొనాలనే రోజులు వచ్చిపడ్డాయి.
ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం
తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని ఇటీవల విద్యాశాఖ సమీక్షలో పేర్కొనడం హర్షణీయం. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే అని సూచించారు. ఏ ఒక్క బాలుడుగానీ, బాలిక గానీ చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దన్నారు. అంతేకాకుండా విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలని ఆదేశించారు.
ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే అని నిర్ణయించడంతో ప్రభుత్వ బడుల పునరుద్ధరణకు ముందడుగు పడనుంది. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను ఖాళీల భర్తీకి చర్యలను తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అందరికీ విద్యను అందించడంలో ప్రభుత్వ బడులే కీలక భూమిక పోషిస్తాయి. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఆశించిన స్థాయిలో కృషి చేయలేదు. ప్రైవేట్ పాఠశాలలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఈ ధోరణి అసమానతకు దారితీస్తుంది.
గట్టి కృషి జరగాలి
విద్య, వైద్యం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచినప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందని నిపుణులంటున్నారు. కరోనా సంక్షోభంలో ఇది నిజమైనది. దేశంలో బహుళ ప్రజానీకానికి ప్రభుత్వ వైద్యమే ఆధారమైనది. ఇప్పుడు విద్యావ్యవస్థలో కూడా ఇదే ధోరణి కనబడుతుంది. మరోవైపు నూతన విద్యా విధానం సైతం ప్రభుత్వ విద్య ప్రాధాన్యతను నొక్కిచెప్పింది. ప్రజాస్వామ్య జీవన విధానం ప్రభుత్వ పాఠశాలల నుంచే ప్రారంభమవుతుంది.
ఇక్కడి బోధనాభ్యసన కార్యక్రమాలు పిల్లల సమగ్ర వికాసానికి దోహదపడతాయి. వ్యాపార ధోరణి అసలే ఉండదు. ఇవి ఆధునికతకు నోచుకోకపోవడం మూలాన వీటి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నేటికీ ఉన్నత, వృత్తి విద్యలో ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీ సీట్లకు తీవ్ర పోటీ వుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించిన చరిత్ర ఉంది.
తమిళనాడు తరహాలో..
తమిళనాడు ప్రభుత్వం సర్కారు బడుల్లో చదువుకుంటే 7.5శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పాఠశాల విద్య బలోపేతానికి నిదర్శనం. ఇలాంటి విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకురావాలి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలి. కామన్ స్కూల్ విధానాన్ని తీసుకురావాలి. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాన్ని సాధ్యమైనంత త్వరలో చేపట్టాలి.
కేంద్ర నిధులనూ వాడుకోలేదు
మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి పాఠశాల విద్యపై సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన లెక్కల వివరాలు చూస్తే కేసీఆర్ ప్రభుత్వానికి విద్యపై ఉన్న నిబద్ధత ఏపాటిదో అర్థమవుతుంది. తెలంగాణకు సమగ్ర శిక్ష అభియాన్(SSA)కింద 2017 నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సుమారు 9,456 కోట్ల నిధులను విద్యాశాఖలో ఖర్చు చేయలేదు. ఇందులో రాష్ట్ర వాటాగా 40 శాతం నిధులు ఇస్తే.. కేంద్రం 60 శాతం ఇస్తుంది. రాష్ట్రం తన వాటా ఇవ్వకపోవడంతో.. కేంద్రం ఆమోదించిన నిధులు మూలనపడ్డాయని మురళి విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యాభివృద్ధికి కృషి జరగకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
- సంపతి రమేష్ మహరాజ్,సోషల్ ఎనలిస్ట్