
సృష్టి మనుగడకు, వారసత్వానికి మూలం విత్తనం. జీవుల ఆహార, ఆరోగ్యాలు విత్తనం చుట్టే అల్లుకొని ఉన్నాయి. విత్తన సంబంధ జ్ఞానం, స్వేచ్ఛ, అదుపు రైతు చేతుల్లోంచి జారి విత్తనం మీద పెత్తనం కార్పొరేట్ శక్తుల గుప్పిటికి చేరింది. దీంతో వ్యవసాయోత్పత్తి ప్రక్రియ మొత్తం కకావికలమైంది. వ్యవసాయం కుదేలై, రైతు ఆగమైపోవడానికి దారితీసిన విపరిణామాల్లో ఇదే కీలకం. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానపు వెల్లువ మేలు చేస్తున్నట్టే కనిపించినా... దారితప్పి, విత్తనంపై మార్కెట్ శక్తుల పెత్తనానికే దారులు పరిచింది. లాభాపేక్షే లక్ష్యమైన వ్యాపారం సంప్రదాయ, సహజ వ్యవసాయ ప్రక్రియను పూర్తిగా కమ్మేసింది. రైతు అయోమయానికి గురవుతున్నాడు. అన్ని దశల్లో ఆహారోత్పత్తి ప్రక్రియను ఒకప్పుడు శాసించిన రైతు ఇవాళ మార్కెట్ మాయ దుకాణాల గడప ముందు దీనంగా నిలబడి, వారిచ్చే విత్తనాలను కళ్లకద్దుకొని పొలానికి తెస్తున్నాడు. పండేదెంతో? ఎండేదెంతో? ఈ పరిస్థితి మారాలి. మళ్లీ పూర్వపు రోజులు రావాలి.
దుక్కి దున్ని ..చేలు, పొలాలను సాగుచేసి కాయకష్టంతో పంటలు పండించి జాతి మనుగడకు ఆహారం అందించే రైతును దేశానికి వెన్నెముకగా వర్ణిస్తారు. వాల్మీకి- వ్యాసుల నుంచి ఇక్బాల్, దువ్వూరి రామిరెడ్డి, జాషువా, శ్రీశ్రీ దాకా కవులెందరో తమ సాహితీ సృజనతో రైతుకు పట్టంగట్టారు. కానీ, పాలకులు, విధాన నిర్ణేతల ప్రాధాన్యతల్లో రైతెప్పుడూ చిట్టచివరన నిలుస్తున్నాడు. అతన్ని అలా నిలబెడుతున్నారు. వాగ్దానాలే తప్ప ప్రభుత్వాలు రైతాంగానికి ఎప్పుడూ సరైన న్యాయం చేయవు. విధాన లోపాలు కొన్నయితే ఆచరణ లోపాలు, అమలు వైఫల్యాలు మరికొన్ని. వెరసి... ఆతని ఏ సమస్యకూ తక్షణ స్పందన లభించదు.
పంట ప్రక్రియ ప్రారంభించే విత్తనం నుంచి మొదలెట్టి, ఎండనక, వాననక ఆరుగాలం రైతు కష్టించి సాధించిన పంట ఉత్పత్తుల్ని అమ్ముకునేదాకా.... అన్ని దశల్లో కష్టాలే, కడగండ్లే! ఎప్పుడూ ప్రకృతిపైనో, ప్రభుత్వాల మీదో భారం వేసి మనమంతా మిన్నకుండటం సరికాదు. పౌరసమాజపు బాధ్యత కూడా ఉంటుంది. వీలయినన్ని మార్గాల్లో రైతుకు చేదోడు వాదోడుగా ఉండటం, వారిలో వారు పరస్పర సహకారం అందించుకునే అవకాశాలు కల్పించడం, అందుకు వేదికలు ఏర్పాటు చేయడం అవసరం. అటువంటి ప్రయత్నంలో భాగమే... కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సీజీఆర్ సంస్థ భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ కలిసి, మరో పదహారు సంస్థల సహకారంతో తెలంగాణలో తొలి ‘విత్తన పండుగ’కు రూపకల్పన చేశాయి.
విత్తనమే సృష్టి గమనానికి మూలం
‘చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంపు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత?’ అన్నాడు యోగి వేమన! మర్రివంటి మహావృక్షం ముందు దాని విత్తనం చాలా చిన్నదే. కానీ, అదే అంతటి మహావృక్ష రాజానికి మూలాధారం. అదీ విత్తనపు గొప్పదనం. ప్రపంచమంతటా, ఆ మాటకొస్తే మనదేశంలోనూ వేల సంవత్సరాలుగా విత్తనాలపై అవగాహన, వాటికి సంబంధించిన జ్ఞానం, సేకరించడం, భద్రపరచడం, పంచుకోవడం, ఉపయోగించడం... అన్నీ రైతే చేసేవాడు. కాలం మారింది. పరిస్థితి చేజారింది. మార్కెట్ ఆధిపత్య శక్తుల కుయుక్తుల వల్ల తరాలుగా వస్తున్న రైతు సంప్రదాయిక జ్ఞానం, స్వయంసమృద్ధి, సర్వజన ప్రయోజనం క్రమంగా నిర్లక్ష్యపు నీలినీడల్లోకి జారి కనుమరుగవుతోంది.
నిన్నా ఇవాల్టి వరకు రైతు నోటిమాటే శాసనంగా, వారసత్వ సంపదగా, పరస్పర సహకార నమూనాగా రైతు చేతుల్లో, చేతల్లో సహజంగా విరాజిల్లిన విత్తన సంస్కృతి నెమ్మదిగా పరాయీకరణమైంది. ఆరోగ్యానికి ఆహారం మూలమైనట్టే.. ఆహారానికి పంట, పంటకు విత్తనం మూలం. అది రైతు చేతుల్లో, చేతల్లోనే ఉండాలె. రైతులకు ఈ ఎరుక పెరగాలె! అందుకొక అవకాశం పౌరసమాజం కల్పించాలె.
4 నుంచి తెలంగాణ తొలి ‘విత్తనాల పండుగ’
స్థానిక విత్తనం, ప్రకృతి సానుకూల సహజ విత్తనం, సంప్రదాయ పరిజ్ఞానం, సహకారం, సంస్కృతి... పరస్పరం వినియోగమవ్వాలి. ఆ తెలివి రైతు నుంచి రైతుకు విద్యుత్తులా, విద్వత్తులా ప్రవహించాలె. మన పల్లె సీమల్లో ఒకనాటి వైభవం ఇప్పుడు మళ్లీ మొలకెత్తాలె! ఆ ఉద్దేశం, లక్ష్యంతోనే ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లి గ్రామం (శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి) వద్ద తెలంగాణ తొలి ‘విత్తనాల పండుగ’ నిర్వహిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రైతులు, రైతు ప్రతినిధులు, విత్తన- వ్యవసాయ నిపుణులతో ఏర్పాటు చేస్తున్న యాభైకి పైగా స్టాళ్లతో ఆ మూడొద్దులు వేడుక జరుగనుంది. సహజ వ్యవసాయ సామ్రాజ్యానికి రైతే తిరిగి మకుటంలేని మహారాజవ్వాలి. తాత్కాలికంగా కమ్మిన చీకటిని కూకటివేళ్లతో పెకిలించి, రేపటి వెలుగుకు రేకులు పట్టాలి. విత్తన శోభకు బొట్టు పెట్టాలి. రైతుకు జై కొట్టాలి!
మహిళా గౌరవం మరింత పెరగాలి
విత్తనాల గుర్తింపు, సేకరణ, భద్రపరచడంలో మగవారి కన్నా ఆడవాళ్లదే చురుకైన, సముచిత పాత్ర! ఎందుకంటే వారి శ్రద్ధ, నైపుణ్యం అటువంటిది. ఆరోగ్యానికి భద్రత, ఆహారానికి రక్షణ కల్పించే విత్తనాల నిర్వహణ రైతు చేతుల్లోనే ఉంటే.... వ్యవసాయ కుటుంబాల్లోని మహిళలు ఆ పనిలో నిమగ్నం కావడానికి, సదరు గౌరవం పొందడానికి ఆస్కారం పెరుగుతుంది. జన్యుమార్పిడి విత్తనాలు రాకముందు, విత్తనాలపై కార్పొరేట్లు గుత్తాధిపత్యం సాధించడానికి ముందు అదే సంస్కృతి పరిఢవిల్లింది. తాజా మూడు రోజుల విత్తన పండుగలో ఈ అంశాలన్నీ లక్ష్యంగా పేర్కొన్నారు. విత్తనాల సేకరణ, భద్రపరచడం, పంచుకోవడం, ఉపయోగించడం వాటిని ఓ ఉద్యమంగా చేస్తారు. విత్తనాలను గుర్తించడంలో, దాచుకోవడంలో, పెంపొందించడంలో స్థానిక ప్రజల నైపుణ్యాలను వృద్ధి చేయడాన్ని ఓ లక్ష్యంగా చెప్పారు.
మన వృక్ష, జంతు జాతులను కాపాడుకోవడంతోపాటు వాటికి సంబంధించిన సహజ, సాంస్కృతిక పద్ధతులను, సంప్రదాయాలను గౌరవించడానికి ఈ వేదికను వాడుకోనున్నారు. రైతులు, ఆదివాసులు, కొండ- గిరిజన, -అటవీ ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, తదితర జీవనోపాధులు గలవారితో పాటు వారి భవిష్యత్ తరాల విత్తన హక్కులను కాపాడటాన్ని లక్ష్యంగా వెల్లడించారు. స్థానిక ప్రజల అవసరాలు, ముఖ్యంగా జీవనపద్ధతులు -ఆరోగ్యాల్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర- సహజ -ప్రకృతి వ్యవసాయానికి దన్నుగా నిలవటం, అడవులు, సహజ వనరులు, జీవవైవిధ్య సంరక్షణకు తోడుగా నిలవటం కూడా తాజా పండుగ వెనుక బలమైన లక్ష్యం. రైతులు తమ ఉత్పత్తుల నుంచి ప్రకృతి అనుకూల విత్తనాలను తీసి, పరస్పర వినిమయం చేసుకుంటూ స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రైతులు కలిసికట్టుగా పనిచేసుకునే ఒక నెట్వర్క్ను ప్రోత్సహించడం కూడా ఈ పండుగ ఉద్దేశాల్లో ఒకటి.
వేల రకాల సంప్రదాయ విత్తన జాతులు
విత్తన పండుగలు, సీడ్ మేళాల అలవాటు.. కేరళ, తమిళనాడు, కర్నాటక వంటి దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశాలలో ఇదివరకే ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంత సమగ్రంగా ఇదివరకు ఈ పండుగ సంస్కృతి లేదు. అందుకే, ఆయా రాష్ట్రాల నుంచి నిపుణులు, అనుభవజ్ఞుల్ని ఈ పండుగకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. స్వదేశీ, స్థానిక, అటవీ, సేంద్రియ, రసాయన రహిత ఆహారాన్ని, ఆహారోత్పత్తుల్ని అందుబాటులో ఉంచడం ఒక విశేషం.
వివిధ పంటలకు సంబంధించి కొన్ని వేల రకాల సంప్రదాయ విత్తన జాతుల్ని ఈ పండుగ సందర్భంగా ప్రదర్శించనున్నారు. రైతులు, విత్తన సంరక్షకులు, ఇతర నిపుణులు, ఆదివాసీలు, ఈ రంగంలో పనిచేసే కార్యకర్తలతో మీడియా ప్రతినిధులు ముచ్చటించే అవకాశం కల్పించడం ద్వారా.. ఆయా సందేశాల్ని విస్తృత జనావళిలోకి తీసుకువెళ్లడం ఒక సంకల్పం. రైతులను అన్ని విధాలుగా చైతన్యపరచడానికి ఈ వేదికను గరిష్టంగా ఉపయోగించాలన్నది నిర్వాహకుల యోచన! ఇటీవలి కాలంలో ఒట్టి నినాదంగా మిగిలిపోయిన.. ‘రైతే రాజు’ నినాదం నిజం కావడానికి విత్తన సత్తువే సరికొత్త దారి!
(రేపటి నుంచి రంగారెడ్డి జిల్లా అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్’లో తెలంగాణ తొలి ‘విత్తన పండుగ’)
దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్