365 రోజులు..రోజుకో సాయం చేయడమే టార్గెట్

365 రోజులు..రోజుకో సాయం చేయడమే టార్గెట్

ప్రతిరోజూ ఏదో ఒక సాయం చేయడమే అతని లక్ష్యం. అలా 365 రోజులు చేయాలనేది అతని  టార్గెట్​. ప్రతిరోజూ ఏదో ఒక విధంగా సాయం చేస్తూ.. వీడియో తీస్తుంటాడు. ఆ వీడియో చూసి కొందరైనా తమ చుట్టుపక్కల ఉండే వాళ్లకు సాయం చేస్తారేమో అనే చిన్న ఆశ అతనిది. అందుకే ఆ వీడియోలను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేస్తుంటాడు యూట్యూబర్​ శీను మాలిక్​. దానివల్ల అతనికి లాభమా? నష్టమా? అనేది పక్కన పెడితే.. నలుగురికీ సాయం చేయాలనే ఆలోచన మాత్రం అతనిలో చాలా బలంగా ఉంది. అవసరం ఉన్న వాళ్లకు సాయం చేసే గుణమే శీనుని ఎంతోమంది హృదయాలకి చేరువ చేసింది. 

రోడ్డు పక్కన ఒక కాస్ట్లీ పోర్షె కారు పార్క్​ చేసి ఉంది. ఆ ఏరియాలో అలాంటి కార్లు రావడం చాలా అరుదు. అందుకే ఆ కారుని చూసిన దివ్యాంగుడు ఒకరు దాని దగ్గరికి వెళ్లి సెల్ఫీ తీసుకోవాలి అనుకున్నాడు. చుట్టుపక్కల ఎవరూ తనని గమనించడం లేదని నిర్ధారించుకున్నాడు. కారు ముందు నిల్చొని, బ్యానెట్​కు ఆనుకుని ఫొటో తీసుకోబోయాడు. సరిగ్గా అప్పుడే ‘‘ఏం చేస్తున్నావ్​?” అన్న గొంతు వినిపించింది. అంతే... వెంటనే ఫొటో తీసుకుంటున్న ఆ వ్యక్తి స్పీడ్​గా అక్కడి నుంచి వెళ్లిపోబోయాడు. 

‘ఏం చేస్తున్నావ్​?’ అని అడిగిన వ్యక్తి పరుగెత్తి మరీ అతన్ని ఆపాడు ఆ కారు ఓనర్​ శీను. ‘‘కారు ముందు ఫొటో దిగాలి అనుకుంటున్నావా?’’ అని అడిగాడు. అందుకు అతను అవునన్నట్టు తల ఊపాడు. అంతే వెంటనే దివ్యాంగుడి చేతిలో ఉన్న ఫోన్​ తీసుకుని, అతన్ని కారు ముందు నిలబెట్టి రకరకాల పోజుల్లో ఫొటోలు తీశాడు. అంతటితో పని అయిపోలేదు. ఆ దివ్యాంగుడిని కారులో ఎక్కించుకుని సిటీ రోడ్ల మీద తిప్పాడు. ఖరీదైన లగ్జరీ కారులో ప్రయాణించిన అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సన్నివేశాన్ని, అతని ఆనందాన్ని రికార్డ్ చేసి.. ఆ వీడియోని యూట్యూబ్​లో అప్​లోడ్​ చేశాడు యూట్యూబర్​ శీను.  

ఆ వీడియో చూసిన చాలామంది శీను మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్​, ఇన్​స్టాగ్రామ్​లో బాగా వైరల్​ అవుతోంది. ఈ ఆర్టికల్​ రాసేనాటికి ఈ వీడియోకు 250 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. అంతేకాదు.. అతని దయాగుణం గురించి, ఈ వీడియో గురించి నేషనల్​ మీడియాలో కూడా వచ్చింది. 

యూట్యూబ్​ ప్రయాణం..

ఈ యూట్యూబర్​ శీను మాలిక్​ (అసలు పేరు రవికుమార్​) విషయాల్లోకి వెళ్తే... శీనుది ఢిల్లీ. వాళ్లది ఉన్నత కుటుంబం. చాలారోజుల నుంచి యూట్యూబ్​ ఛానెల్​ పెట్టాలి అనుకున్నాడు. కానీ.. కుదర్లేదు. సరిగ్గా ఏడాది క్రితం 2023 ఆగస్టు 24న ‘శీను మాలిక్​ వ్లాగ్స్​’ పేరుతో యూట్యూబ్​ ఛానెల్​ క్రియేట్​ చేశాడు. ఇప్పటివరకు 250కి పైగా వీడియోలు అప్​లోడ్​ చేశాడు. వాటిలో చాలావరకు షార్ట్​ వీడియోలే. అయితే.. ఛానెల్‌‌‌‌‌‌‌‌ పెట్టిన కొత్తలో వ్యూస్​ అంతగా రాలేదు. అంతెందుకు కొన్ని వీడియోలకు పది వేల వ్యూస్​ కూడా దాటలేదు. ఛానెల్​ పెట్టిన కొత్తలో శీను దుబాయి వెళ్లాడు. అక్కడ వ్లాగ్స్​ తీసి అప్​లోడ్​ చేశాడు. అయినా... రీచ్​ రాలేదు. ఆ తర్వాత 365 డేస్​ ఛాలెంజ్​ మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా.. ప్రతిరోజు ఒక సాయం చేసి.. ఆ వీడియోని అప్​లోడ్​ చేయడం మొదలుపెట్టాడు. అలా అతను సాయం చేస్తున్న కొద్దీ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్స్​, వ్యూస్​ పెరుగుతూ వచ్చాయి. ఈ సిరీస్​లో ఇప్పటివరకు 230కి పైగా​ వీడియోలు చేశాడు. 

ఏడాదికి 

ఛానెల్​ పెట్టి ఏడాది కూడా దాటకముందే.. దాదాపు ఎనిమిది లక్షల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. అంతేకాదు.. చాలా వీడియోలకు మిలియన్​కు పైగా వ్యూస్​ వచ్చాయి. కాళ్లు లేని వ్యక్తికి సాయం చేసిన ఒక వీడియోకు 28 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. ఛానెల్​లో మిలియన్​ వ్యూస్​ దాటిన వీడియోలు ఇంకా చాలానే ఉన్నాయి.

చిన్నారి వీడియో 

ఒక తల్లి రోడ్డు పక్కన ఫుట్​పాత్​పై కొడుకుని పడుకోబెట్టింది. జంక్షన్​ దగ్గర రెడ్​ సిగ్నల్​ పడగానే అక్కడి నుంచి పరుగులు తీస్తూ వెళ్తుంది. సిగ్నల్​ దగ్గర ఆగిన వెహికల్స్​ దగ్గరకు వెళ్లి అడుక్కుంటుంది. మళ్లీ గ్రీన్​ సిగ్నల్​ పడి.. వెహికల్స్​ కదలడం మొదలవ్వగానే పరుగెత్తి కొడుకు దగ్గరకు వచ్చేస్తుంది. మళ్లీ రెడ్​ సిగ్నల్​ కోసం ఎదురుచూస్తుంటుంది. ఇదంతా చూసిన శీను ఆమెకు ఏదోవిధంగా సాయం చేయాలి అనుకున్నాడు. ఆమె  సిగ్నల్​ దగ్గరకి వెళ్లగానే ఒక నోట్ల కట్టను ఆ బాబు పక్కన పెట్టి వెళ్లిపోయాడు. బాబు దగ్గరకు వచ్చి చూసిన ఆ తల్లి  డబ్బుని చూసి చాలా సంతోషించింది. ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. సాయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని చుట్టుపక్కల చూసింది. కానీ శీను కనిపించలేదు. ఇలాంటి సాయాలు చాలానే చేశాడు ఈ శీను.