- స్టూడెంట్ల బాగు కోసం సలహాలివ్వండి
- 655 స్కూళ్లకు సొంత బిల్డింగ్స్ లేవు.. నిర్మిస్తాం
- గత పదేండ్లలో 62 మంది పిల్లలు చనిపోయారు
- ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేశాం
- పెండింగ్ బిల్లుల విడుదల కంటిన్యూ ప్రాసెస్ అని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గురుకుల పిల్లలతో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క హితవు పలికారు. స్టూడెంట్లు దేశ భవిష్యత్ అని, వారి బాగు కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. గురుకులాల బాగు కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. బుధవారం అసెంబ్లీలో గురుకులాలు, స్కూళ్లపై చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ర్టంలో 655 గురుకులాలకు సొంత బిల్డింగ్స్ లేవని, వాటికి భవనాలు నిర్మిస్తామని తెలిపారు.
‘‘గురుకులాల్లో ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరం. ఇలాంటివి రానున్న రోజుల్లో జరగకుండా అధికారులతో టాస్క్ ఫోర్స్, ఫుడ్ క్వాలిటీపై ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేశాం” అని తెలిపారు. ‘2014 నుంచి 2023 వరకు 62 మంది స్టూడెంట్లు చనిపోయారు. పోయినేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 25 మంది మరణించారు. ఫుడ్ పాయిజన్ కు గురైన స్టూడెంట్లకు మంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నాం.
ALSO READ : కాళేశ్వరం అప్పులు ప్రభుత్వమే కట్టాలి : రజత్ కుమార్
చనిపోయిన విద్యార్థిని శైలజ వైద్యం కోసం రూ.12లక్షలు ఖర్చు చేసినం. ఆమె ట్రీట్ మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర సహా ముగ్గురం ఫాలో అప్ చేసినం. కానీ దురదృష్టవశాత్తూ శైలజ బతకలేదు. ఆమె కుటుంబానికి పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, ఔట్ సోర్సింగ్ జాబ్ ఇచ్చాం” అని మంత్రి సీతక్క తెలిపారు. గురుకుల స్టూడెంట్స్ హెల్త్ పై యాప్ తో మానిటరింగ్ చేస్తున్నామని, అన్ని క్యాంపస్ లలో ఏఎన్ఎంలు ఉన్నారని చెప్పారు. ‘‘మార్కెట్ ధరకు అనుగుణంగా గుడ్డు రేటు పెంచుతాం. డైట్ ప్లాన్ పై న్యూట్రిషన్ సలహాలు తీసుకొని మెనూ రెడీ చేశాం. గురుకులాల పెండింగ్ బిల్స్ రిలీజ్ అనేది కంటిన్యూ ప్రాసెస్. అద్దె బకాయిల కోసం స్కూల్ బిల్డింగులకు తాళాలు వేసిన ఓనర్లపై చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు.