పండగ పూట స్టాక్ మార్కెట్ కుదేలు.. రూ.24.69 లక్షల కోట్లు ఖతం

  • 1,048 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్  నిఫ్టీ 345 పాయింట్లు డౌన్​

ముంబై: ఈక్విటీ మార్కెట్లు సోమవారం విపరీతంగా నష్టపోయాయి. సెన్సెక్స్​ వెయ్యి పాయింట్లు తగ్గి 77 వేల దిగువనకు పడిపోయింది. గ్లోబల్ ఈక్విటీల్లో భారీ అమ్మకాలు, క్రూడాయిల్​ధరలు పెరగడం, రూపాయి మారక విలువ దారుణంగా పడిపోవడం, విదేశీ నిధుల ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్​దెబ్బతింది. వరుసగా నాలుగో సెషన్లోనూ సూచీలు పడ్డాయి. సెన్సెక్స్​ 1,048.90 పాయింట్లు పడిపోయి 76,330.01 వద్దకు చేరింది. 

ఇంట్రాడేలో ఇది 1,129.19 పాయింట్లు నష్టపోయి 76,249.72 స్థాయికి పడిపోయింది. బీఎస్​ఈలో 3,562 స్టాక్స్​ నష్టపోయాయి. 508 స్టాక్స్​52 వారాల కనిష్టానికి, 120 స్టాక్స్ ఏడాది కనిష్టానికి చేరాయి. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 345.55 పాయింట్లు పడి 23,085 వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్లు రూ.24.69 లక్షల కోట్లు నష్టపోయారు. గ్లోబల్ మార్కెట్ల మాదిరే మన మార్కెట్లూ తీవ్రంగా నష్టపోయాయని, యూఎస్​లో వడ్డీరేట్లు పెద్దగా తగ్గబోవన్న సంకేతాలతో సూచీలు డీలా పడ్డాయని జియోజిత్​ ఫైనాన్షియల్​సర్వీసెస్​రీసెర్చ్​ హెడ్​ వినోద్​ నాయర్​అన్నారు. బాండ్​ ఈల్ట్స్​పెరగడం వల్ల డాలర్​కూడా బలపడిందని చెప్పారు. 

సెన్సెక్స్​ షేర్లకు దెబ్బ

సెన్సెక్స్​  ప్యాక్​లో జొమాటో అత్యధికంగా ఏడు శాతం నష్టపోయింది. పవర్​గ్రిడ్​, అదానీ పోర్ట్స్​ ,  టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్​ మహీంద్రా, ఆసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, హిందూస్థాన్ యూనిలీవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభపడ్డాయి. బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్ గేజ్ 4.17 శాతం, స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్ 4.14 శాతం క్షీణించాయి. బీఎస్‌‌ఈలోని అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. 

రియాల్టీ 6.59 శాతం, యుటిలిటీస్ 4.38 శాతం, సర్వీసెస్ 4.35 శాతం, పవర్ 4.23 శాతం, ఇండస్ట్రియల్స్ 4.09 శాతం, కన్స్యూమర్ డిస్క్రిషనరీ 4.04 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 3.96 శాతం, కమోడిటీస్ 3.69 శాతం క్షీణించాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, షాంఘై, హాంకాంగ్ నష్టపోయాయి. జపాన్‌‌లో మార్కెట్లు సెలవు   వల్ల పనిచేయలేదు. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బ్రెంట్​క్రూడ్​బ్యారెల్​ ధర 1.43 శాతం పెరిగి 80.90 డాలర్లకు చేరింది. ఎఫ్​ఐఐలు శుక్రవారం రూ.2,254 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. 

రెండేండ్ల కనిష్టానికి రూపాయి 

రూపాయి మరోసారి దారుణంగా నష్టపోయి రెండేళ్ల కనిష్టానికి చేరింది. డాలర్​తో రూపాయి మారకం విలువ సోమవారం ఏకంగా 66 పైసలు తగ్గి 86.70 (తాత్కాలికం) స్థాయికి దిగజారింది. డాలర్​ బలోపేతం కావడం, క్రూడాయిల్​ ధరలు పెరగడంతో రూపాయి డీలా పడిపడింది. 2023, ఫిబ్రవరి ఆరు తరువాత రూపాయి ఇంతలా పడటం ఇదే మొదటిసారి.

గత రెండు వారాల్లో దీని విలువ 100 పైసలకుపైగా పడిపోయింది. గత ఏడాది డిసెంబరు 19న మొదటిసారిగా 85 మార్క్​కు చేరింది. శుక్రవారం కూడా ఇది 18 పైసలు నష్టపోయి 86.04 వద్ద ముగిసింది. మంగళవారం, బుధవారం కూడా నష్టాలు తప్పలేదు. ఇన్వెస్టర్లు డాలర్లను విపరీతంగా కొనడం వల్ల కూడా రూపాయి దెబ్బతింటున్నదని ట్రేడర్లు చెబుతున్నారు.