
- రాష్ట్ర ఏర్పాటుతో ప్రపోజల్స్ బుట్టదాఖలు చేసిన బీఆర్ఎస్
- పరిశోధన కేంద్రం లేక అవస్థ పడుతున్న ఆలు రైతులు
- కాంగ్రెస్ హయాంలో రీ ప్రపోజల్స్ పెట్టాలని విన్నపం
సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో ఆలుగడ్డ పరిశోధన కేంద్రం ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. 13 ఏళ్ల కింద ఆలుగడ్డ రైతుల కోసం సంగారెడ్డిలో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులు తయారు చేసిన ప్రపోజల్స్ బుట్టదాఖలయ్యాయి. ఉమ్మడి ఏపీలో చేసిన ఆలోచన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. దీంతో ఆలు రైతులు విత్తనం కోసం ఇప్పటికీ పక్క రాష్ట్రాలకు పోయి అవస్థలు పడుతున్నారు.
2012–-13 ఆర్థిక సంవత్సరంలో సంగారెడ్డిలో వైఎస్సార్ఉద్యాన పరిశోధన కేంద్రానికి అనుబంధంగా ఆలుగడ్డ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్లాన్ చేయగా , అందుకు రూ.1.57 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. కానీ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మారడంతో కేంద్రం ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. సౌత్ ఇండియాలో ఒక్క తమిళనాడులోనే ఈ పరిశోధన కేంద్రం ఉంది. ఒకవేళ సంగారెడ్డిలో ఏర్పాటు చేసి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఆలుగడ్డ పరిశోధన కేంద్రంగా రైతులకు
సేవలందించేది.
ఆక్రిప్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు
ఆల్ ఇండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రాజెక్టు (ఆక్రిప్) ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఆలుగడ్డ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. సిమ్లాలో ఉన్న సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీపీఆర్ఐ)కు ప్రతిపాదనలు పంపారు. అందుకు సీపీఆర్ఐ సానుకూలంగా వ్యవహరించినట్టు తెలిసింది. దీంతో సంగారెడ్డిలోని వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రం సైంటిస్టులు ఏడు రకాల ఆలుగడ్డలపై రీసెర్చ్ చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర రాజకీయాలలో వచ్చిన మార్పులు కారణంగా ఆలు పరిశోధన కేంద్రం అంశం కాస్త మరుగున పడిపోయింది. ఇప్పటికైనా సంగారెడ్డికి ఆలుగడ్డ రీసెర్చ్ సెంటర్ ను తీసుకురాగలిగితే ఆలు రైతులకు మేలైన విత్తనం లభించే అవకాశం ఉంది.
సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 22 వేల ఎకరాల్లో ఆలుగడ్డ పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 12 వేల ఎకరాలు సాగవుతుండగా, జహీరాబాద్, ఆందోల్-జోగిపేట డివిజన్ల పరిధిలో ఎక్కువగా ఆలు పండిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో ఆలు సాగుచేస్తున్నారు. గజ్వేల్, సిద్దిపేట డివిజన్ల పరిధిలో ఆలు సాగు ఎక్కువగా జరుగుతోంది. ఈ పంట మూడు నెలలు కావడంతో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఆలుగడ్డ పరిశోధన కేంద్రం సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వారీగా పంట సాగు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పక్కనే ఉన్న వికారాబాద్ జిల్లా రైతులకు కూడా పరిశోధన కేంద్రం ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంగారెడ్డిలో ఆలుగడ్డ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆలు రైతులు కోరుతున్నారు.