ODI World Cup 2023: మా ఆటపై హైదరాబాద్ బిర్యాని ప్రభావం చూపుతోంది: పాక్ వైస్ కెప్టెన్

ODI World Cup 2023: మా ఆటపై హైదరాబాద్ బిర్యాని ప్రభావం చూపుతోంది: పాక్ వైస్ కెప్టెన్

పాకిస్థాన్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో వీరి ఫీల్డింగ్ విన్యాసాలు చూస్తుంటే గల్లీ క్రికెట్ ని తలపిస్తుంది. కొన్నిసార్లు వీరు చేసే చెత్త ఫీల్డింగ్ కి నవ్వు కూడా వస్తుంది. అయితే వరల్డ్ కప్ లాంటి మెగా లీగ్ వచ్చినా వీరి తీరు మాత్రం మారలేదు. నాసిరకంగా ఫీల్డింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు అవకాశాలు ఇస్తున్నారు.

తాజాగా నిన్న ఆసీస్ తో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులో సునాయాసంగా క్యాచులను వదిలేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే తమ పేలవ ఫీల్డింగ్ కి హైదరాబాద్ బిర్యాని కారణమని  వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హర్షా భోగ్లేతో మాట్లాడిన స్టాండ్-ఇన్ కెప్టెన్ షాదాబ్.. జట్టు హైదరాబాదీ బిర్యానీని ఇష్టపడిందని చెప్పాడు.

"మేము రోజూ హైదరాబాదీ బిర్యానీ తింటున్నాము, అందుకే మేము ఫీల్డ్‌లో కొంచెం నెమ్మదిగా ఉన్నాము" అని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించాడు. మొత్తానికి వారి ఫీల్డింగ్ లోపాలను కవర్ చేసుకోవడానికి ఇలా హైదరాబాద్ బిర్యాని మీద చాలా తెలివిగా నెట్టేశాడు షాదాబ్. ఇక ఈ మ్యాచులో బాబర్ అజామ్ సంచలన బ్యాటింగ్ చేసినప్పటికీ, హైదరాబాద్‌లో పాక్ జట్టు 14 పరుగుల తేడాతో ఓడింది. 

హైదరాబాద్ బిర్యానీకి 20 మార్కులు

వన్డే వరల్డ్ కప్ కోసం ఏడేళ్ల తర్వాత భారత్ కు వచ్చిన పాక్ క్రికెటర్లు.. ఇక్కడి హైదరాబాద్ బిర్యానీకి మైమరిచి పోయారు. తమ కరాచీ బిర్యానీ కంటే.. హైదరాబాద్ బిర్యానీ అద్భుతంగా ఉందని హసన్ అలీ చెప్పగా... 10కి 20 మార్కులు వేస్తానని హరీస్ రవూఫ్ పేర్కొన్నారు. కాగా, తమ జట్టుకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించడం పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.