నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో కొట్లాడి, 1,230 మంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అన్యాయానికి గురవుతోంది. నీళ్ల పేరుతో కమీషన్లు దండుకుంటున్నారు. నిధులన్నీ ఒకే కుటుంబం చేతిలోకి వెళ్లిపోయాయి. నియామకాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆశలను అడియాశలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సంక్షేమ పాలనను తెలంగాణ ప్రజలకు అందించేందుకు సిద్ధమయ్యారు షర్మిల.
వైఎస్ఆర్ పాలన అంటేనే సంక్షేమం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా అందించిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలు కూడా ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేయించుకునే అవకాశం కల్పించారు. సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని, వైఎస్ఆర్ఔన్నత్యాన్ని కొనియాడారు. పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న సంకల్పంతో ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టి ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి చదువులను పేదలకు దగ్గర చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. పావలా వడ్డీకి రుణాలు ఇప్పించి మహిళా సాధికారతకు వైఎస్ఆర్ కృషి చేశారు. ఇప్పుడు ఆ పథకాన్నే లేకుండా చేశారు కేసీఆర్. అత్యవసర వైద్య సేవల కోసం '108'ను, '104' ద్వారా సంచార వైద్యశాలలను వైఎస్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ మాత్రం '104' సేవలను నిర్వీర్యం చేశారు. ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన మహనీయుడు వైఎస్ఆర్. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని ఆ పథకాన్ని ప్రవేశపెట్టి అన్నదాతలకు బాసటగా నిలిచిన రైతు పక్షపాతి వైఎస్ఆర్. వైఎస్ఆర్ పాలన అంటేనే సంక్షేమం, సంక్షేమం అంటేనే రాజన్న అన్నంతగా పథకాలు రూపకల్పన చేసి ప్రజా రంజక పాలన అందించిన మహానేత ఆయన.
తెలంగాణ రాష్ట్రానికి గ్రహణం పట్టింది. పాలకులు చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అవసరానికి ఓట్ల కోసం వాడుకునే దుర్మార్గపు వ్యవస్థ కొనసాగుతున్నది. ఇది రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదు. అధికార టీఆర్ఎస్ పార్టీ అన్నీ జూటా మాటలతో పూట గడుపుతోంది. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ఎక్కడైనా ఉపఎన్నికలు వస్తే వరాల జల్లు కురిపించడం, అవసరం తీరాక వాటిని పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. దీనివల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాటలు చెప్పి జనాన్ని మోసం చేసే గులాబి పార్టీని గద్దె దింపి సంక్షేమమే ఎజెండాగా సాగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో తెచ్చిన పథకాలను ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రక అవసరం.
షర్మిల నాయకత్వం చారిత్రక అవసరం
రాజన్న ఆశయాలను పుణికిపుచ్చుకున్న వైఎస్ షర్మిల రాజన్న సంక్షేమ పాలనను మళ్లీ తెలంగాణకు అందించాలన్న సంకల్పంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ప్రజా సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి వేసిన ప్రతీ అడుగూ ఆదర్శమే. ఆ ఆదర్శపు భావజాలంతో షర్మిల పార్టీ పెట్టడం తెలంగాణకు శుభపరిణామం. దొర గడీల పాలనను అంతమొందించి, ప్రజలు మెచ్చిన, వారి సంక్షేమం కోసం పాటుపడే నాయకత్వం ఇప్పుడు తెలంగాణ సమాజానికి అవసరం. ఆ మహా ఆశయంతో షర్మిలక్క ముందుకు రావడం స్వాగతించదగ్గ పరిణామం. విశ్వసనీయతకు మారుపేరైన వైఎస్ఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా.. మాట ఇచ్చి మడమ తిప్పని వంశం నుంచి వచ్చిన షర్మిల నాయకత్వం ఇప్పుడు చారిత్రక అవసరం. పూటకో మాట మార్చే కేసీఆర్ గారడీ మాటలకు కాలం చెల్లింది. జనం అలాంటి అబద్ధపు హామీలను నమ్మే పరిస్థితిలో లేరన్న సంగతి గులాబీ బాస్ గుర్తిస్తే మంచిది. నమ్మించి మోసం చేస్తున్న నయవంచక పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కొత్త రాజకీయ వేదిక కావాలని ఆశిస్తున్నారు.
టీఆర్ఎస్ పాలనలో విష సంస్కృతి
గిరిజనులకు అటవీ భూములపై వైఎస్ హక్కులు కల్పించడంతో భూమినే నమ్ముకున్న ఆదివాసీలకు మేలు జరిగింది. 2004లో అధికారంలోకి వచ్చాక 93,494 మంది రైతులకు 4 లక్షల 30 వేల ఎకరాలను 5 విడతల్లో అటవీహక్కు పత్రాలు ఇచ్చిన రైతు బాంధవుడు వైఎస్. పోడు భూముల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు కేటాయించారు. కానీ.. స్నేహపూర్వక వాతావరణంలో ఉన్న గిరిజనులు, లంబాడీలు, గోండు ఆదివాసీల మధ్య రిజర్వేషన్ చిచ్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇలా విద్వేషాలు రెచ్చగొట్టి పూట గడుపుకోవడం దేనికి సంకేతంగా భావించాలి. పేద ముస్లింలకు విద్యా, ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ఆర్ ది. ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వారిని మోసం చేశారు కేసీఆర్. బీసీల మధ్య చిచ్చు పెట్టి బీసీలు, ఎంబీసీలు అంటూ విభజించారు. ఎస్సీల మధ్య పంచాయితీ తేలకుండా వారిని విభజించారు. గొల్ల, కురుమలను, ముదిరాజ్లు-బెస్త వారి మధ్య కొట్లాట పెట్టారు. ఇలా కులాల పేరుతో, మతాల పేరుతో విభజన రేఖలు తీసుకురావడం సమాజానికి మంచిది కాదు. ఏదైనా సమస్య ఉంటే వాటికి సామరస్య పరిష్కారాలు చూపాలి. అందరూ కలిసి మెలిసి ఉండే సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాలి. ఇది రాష్ట్ర ప్రగతికి మేలు చేస్తుంది. కానీ టీఆర్ఎస్ సర్కార్ పాలనలో విష సంస్కృతిని ప్రజలపై రుద్దడం రాజనీతి అనిపించుకోదు.
షర్మిల నాయకత్వాన్ని బలపరచాలి
కులమతాలకు అతీతంగా వైఎస్ఆర్ను అందరూ అక్కున చేర్చుకున్నారు. మళ్లీ అలాంటి సంక్షేమం పాలన, స్వర్ణయుగం రావాలంటే షర్మిలక్క నాయకత్వాన్ని బలపర్చాలి. అందుకే షర్మిల ప్రజలతో మమేకమవుతున్నారు. అన్ని జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రజల సాధకబాధకాలు తెలుసుకున్నారు. ముస్లిం మైనార్టీ, గిరిజనులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలను కలిశారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను కొంత మందిని పరామర్శించారు. నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ తప్పుడు విధానాలను షర్మిలక్క ఎండగడుతూ వచ్చారు. చారిత్రకంగా చూసుకుంటే రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర వనితల గాథలు విన్నాం. చాకలి ఐలమ్మ తెగువను కొనియాడారు. దేశంలో ఇందిరాగాంధీ, మాయావతి, జయలలిత, మమతాబెనర్జీ లాంటి మహిళల నాయకత్వంలో అభివృద్ధి ఫలాలను చూశాం. షర్మిల కూడా ఆ కోవలోనే గొప్ప ఆశయంతో ముందుకు వస్తున్నారు. ప్రజలంటే ఓటు వేసే యంత్రాలు కాదు. మనల్ని గద్దెనెక్కించిన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించాలని సీఎం కాగానే అన్ని హామీలు నెరవేర్చిన వైఎస్తనయ షర్మిల మన ముందుకు రావడాన్ని స్వాగతిద్దాం. షర్మిల స్థాపిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రజలందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
కుటుంబం తప్ప ప్రజలు కేసీఆర్కు అక్కర్లేదు
ఆత్మగౌరవం, అభివృద్ధి నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో.. ఏడేండ్లు గడుస్తున్నా అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు. బంగారు తెలంగాణ పేరు చెప్పి తన ఇంట్లో కొడుకు, కూతురు, అల్లుడు, సడ్డకుడి కొడుకుకు పదవులిచ్చారు కేసీఆర్. తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడు తప్ప, ప్రజల గురించి ఆలోచించ లేదు. విద్యార్థులు, నిరుద్యోగ యువత నోటిఫికేషన్లు లేక, ఏం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్ హయాంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 50 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 ఇలా అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి యువతకు భవితపై భరోసా ఇచ్చారు. కానీ, నియామకాల పేరు చెప్పి టీఆర్ఎస్ నిరుద్యోగులు, విద్యార్థులను నిలువునా ముంచింది. టీఆర్ఎస్ సర్కారుకు ఇకనైనా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.
ప్రజల సమస్యలు తెలుసుకున్న షర్మిల
పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో జనం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను వైఎస్ కనుగొన్నారు. తండ్రి తరహాలోనే ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసిన చరిత్ర షర్మిలక్కకు ఉంది. లక్షలాది మంది ప్రజలను ఆమె కలిసి మాట్లాడారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలనే సంకల్పంతో 'వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ'ని స్థాపించారు షర్మిలక్క. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆత్మహత్యలు షర్మిలను కలచివేశాయి. యువత ఆత్మహత్యలతో చలించిపోయారామె. అద్దాల మేడలు, ఏసీ రూములు, ఫాంహౌస్ లకు పరిమితమైతే ప్రజల గోడు తెలిసేదెలా? వారు ఎలాంటి విధానాలు కావాలనుకుంటున్నారో అర్థం కాదు. అందుకే సుదీర్ఘ పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లారు వైఎస్ఆర్. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం లాంటి పథకాల రూపకల్పనకు ఆ పాదయాత్ర పునాదిగా నిలిచింది. అందుకే ఆయన జనం గుండెల్లో నిలిచాడు.
- ఇందిరా శోభన్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ