భద్రాచలంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం

భద్రాచలంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం
  • రామయ్యకు సువర్ణ పుష్పార్చన.. అభిషేకం

భద్రాచలం, వెలుగు :  కార్తీక మాసంలో వచ్చే మూడో ఆదివారం శివపార్వతుల కల్యాణం ఏటా నిర్వహించడం మూడు తరాలుగా వస్తున్న సంప్రదాయం. దీనిలో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. నూతనంగా నిర్మించిన కల్యాణమండపాన్ని ఈవో రమాదేవి ప్రారంభించి, తలంబ్రాలు స్వయంగా మేళతాళాల నడుమ సీతారామచంద్రస్వామి తరఫున తీసుకురాగా భక్తుల హర్షధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా కల్యాణం జరిగింది. 

పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈవో రమాదేవి సమర్పించగా ముందుగా శివపార్వతులకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీతం, మహా సంకల్పం, రక్షాబంధనం, జీలకర్రబెల్లం తర్వాత మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత యోక్త్రం, బ్రహ్మముడి వరుస క్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణం తిలకించిన, చేయించిన భక్తులకు వేదాశీర్వచనంతో పాటు తీర్థప్రసాద వినియోగం జరిగింది. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అంతకు ముందు ఉదయం సీతారామచంద్రస్వామికి గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం చేశారు.

భక్తులకు అభిషేక జలాలు పంపిణీ చేశాక బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. సీతారామచంద్రస్వామికి హారతులు కనుల పండువగా ఇచ్చారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం, సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు. వీకెండ్​ ఆదివారం కావడంతో పాపికొండ టూరిస్టులు, కార్తీక స్నానాలకు వచ్చిన భక్తులతో ఆలయం రద్దీగా మారింది. భక్తులకు దర్శనం, ప్రసాదాల కొరత లేకుండా దేవస్థానం జాగ్రత్తలు తీసుకుంది.