
- మేళ్లచెర్వు ఆలయానికి 5 లక్షల మంది భక్తులు వచ్చే ఛాన్స్
- నాగార్జునసాగర్ ఏలేశ్వరస్వామి ఆలయానికి లాంచీ రెడీ
మేళ్లచెర్వు/సూర్యాపేట/నార్కెట్ పల్లి, వెలుగు : మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాలకు రంగులు వేయడంతోపాటు విద్యుత్‌దీపాలతో అలంకరించారు. అభిషేకాల్లో పాల్గొనేందుకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ముస్తాబైన మేళ్లచెర్వు..
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. చివరి రోజు పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. స్వామివారిని దర్శించుకోవడానికి రూ.20,100,200 టిక్కెట్లు నిర్ణయించారు. వీఐపీ టిక్కెట్లను ఈసారి రద్దు చేసినట్లు ఈవో తెలిపారు. బుధవారం తెల్లవారుజామున తొలి అభిషేకాన్ని ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతిరెడ్డి దంపతులు నిర్వహిస్తారు.
దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, గర్భిణులకు స్పెషల్ క్యూలైన్ ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణం వీక్షించడానికి భారీ ఎల్ఈడీ స్ర్క్రీన్లను ఏర్పాట్లు చేశారు. జాతరలో ఎడ్ల పందేలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పోటీల్లో గెలుపొందినవారికి ట్రాక్టర్లు, బుల్లెట్లను బహుమతులుగా అందజేస్తారు. ఈ పోటీలను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారు. వీటిని చూసేందుకు5 లక్షలకుపైగా భక్తులు వస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
పిల్లలమర్రి శివపార్వతుల కల్యాణానికి రెడీ..
ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు పిల్లలమర్రి శివాలయాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేలాదిగా తరలిరానున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. 26న తెల్లవారుజాము నుంచి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మధ్యాహ్నం 1: 30 వరకు సామూహిక అభిషేకాలు, ధ్వజారోహణ, బసవముద్ద, జాగరణ, రాత్రి 12 గంటలకు స్వామివార్ల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. మార్చి 1న ఉదయం అభిషేకం, సాయంత్రం త్రిశూలస్నానం, స్వామివారి ఏకాంత సేవతో వేడుకలు ముగుస్తాయి.
లాంచీలో ప్రయాణం..
మహాశివరాత్రి సందర్భంగా నాగార్జునసాగర్ జలాశయం మధ్యలోని కాత్యాయనీ ఏలేశ్వరస్వామి క్షేత్ర దర్శనానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. దక్షిణ కాశీగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఏలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మాధవస్వామి, ఆంజనేయస్వామి, గణపతి, నాగేంద్రుడు, వీరభద్రుడు కొలువుదీరి ఉన్నారు. ఏలేశ్వర క్షేత్రానికి చేరుకునేందుకు లాంచీల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈనెల 26 నుంచి నాగార్జునసాగర్ హిల్ కాలనీ విజయవిహార్ వెనక ఉన్న తెలంగాణ నూతన లాంచీ స్టేషన్ నుంచి లాంచీలను పర్యాటకశాఖ అధికారులు ప్రారంభిస్తారు. టికెట్ ధర పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.200గా నిర్ణయించారు.
శివరాత్రికి చెర్వుగట్టు సిద్ధం..
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం శివరాత్రికి ముస్తాబైంది. ఈ ఆలయంలో శివరాత్రి వేడుకలు రెండు రోజులపాటు నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామివారికి అభిషేకం చేసి వేడుకలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు గుట్ట కింద అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేస్తారు. రెండు రోజులపాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ లోని పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది.