యాదగిరిగుట్టపై వైభవంగా శివపార్వతుల రథోత్సవం

యాదగిరిగుట్టపై వైభవంగా  శివపార్వతుల రథోత్సవం
  •  ఘనంగా లక్షబిల్వార్చన, రథోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం లక్షబిళ్వార్చన, సాయంత్రం దివ్యవిమాన రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. రథోత్సవాని కన్నా ముందుగా రథం ఎదుట రథాంగ హోమాన్ని సంప్రదాయబద్ధంగా చేపట్టారు. అనంతరం శివాలయంలో నిత్య శివారాధనలు ముగిశాక పార్వతీపరమేశ్వరుల రథోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. 

బుధవారం రాత్రి పార్వతీదేవిని పెళ్లాడిన పరమేశ్వరుడు.. గురువారం అర్ధనారీశ్వర స్వరూపంలో దివ్యవిమాన రథంలో ఆశీనుడై ఊరేగారు. అర్ధనారీశ్వర అలంకారంలో శివుడిని రథంలో అధిష్టింపజేసి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవం కైంకర్యాన్ని ఘనంగా జరిపారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం శివాలయంలో నిత్య హవనాలు, శివపంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనాలు, మూలమంత్ర జపాలతో లక్షబిల్వార్చన పూజలను స్మార్త ఆగమ శాస్త్ర పద్ధతుల్లో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిపిన లక్షబిల్వార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.