రైతులకు అండగా ఉంటాం : శివరాజ్ సింగ్ చౌహాన్

రైతులకు అండగా ఉంటాం : శివరాజ్ సింగ్ చౌహాన్
  • పంట నష్టపోయిన రైతును ఓదార్చిన కేంద్రమంత్రి 
  • గత ప్రభుత్వం విపత్తు నిధులు పక్కదారి పట్టించిందని ఫైర్ 
  • ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే

ఖమ్మం/కూసుమంచి, వెలుగు: వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉం డాలని చెప్పారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి చౌహాన్ ఏరి యల్ సర్వే నిర్వహించారు.

 మధిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో జరిగిన నష్టం గురించి కేంద్రమంత్రు లకు భట్టి వివరించారు. అనంతరం సూర్యాపేట జిల్లా సింగరేణిపల్లి టోల్ ప్లాజా దగ్గర హెలీప్యాడ్​లో హెలికాప్టర్​ దిగింది. ఖమ్మం-–సూర్యాపేట జాతీయ రహదారి ని ఆనుకొని పాలేరు అలుగు ప్రాంతంలో దెబ్బతిన్న పంట లను వాళ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గంలో జరిగిన నష్టం వివరాలను రాష్ట్ర మంత్రి పొంగులేటి వివరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాంరెడ్డి కూడా ఉన్నారు. 

విపత్తుల నివారణకు చర్యలు.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన విప త్తు నిధులను పక్కదారి పట్టించిందని కేంద్రమంత్రి చౌహాన్​ మండిపడ్డారు. నిధుల ఖర్చుకు సంబంధించిన లెక్కలు కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వాడుకుంటేనే మళ్లీ కొత్త నిధులు వస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని కూడా అమలు చేయలేదని, తాము చేస్తామన్నా ఒప్పుకోలేదని చెప్పారు. రాష్ట్రానికి తక్షణ సాయం చేయడంతో పాటు విపత్తుల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు తాను రాష్ట్రానికి వచ్చానన్నారు.  

రైతును హత్తుకుని.. ఓదార్చి 

వరదల వల్ల జరిగిన నష్టంపై పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్రమంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా కోక్యా తండాకు చెందిన రైతు హలావత్ నర్సింహారావు వరదల వల్ల తన పంట ఖరాబైందని వాపోయారు. ఆయన బాధ విని కేంద్రమంత్రి చౌహాన్ ​చలించిపోయారు. రైతును హత్తుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ.. కష్టకాలంలో రైతులు గుండె ధైర్యం కోల్పోవద్దని అన్నారు.‘‘నేను కూడా రైతునే. ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నాను. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం. రైతులు ఎంతో బాధలో ఉన్నారు. వరదలతో వరి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటలతో పాటు ఇండ్లల్లోని వస్తువులు కూడా కోల్పోయారు” అని అన్నారు.