ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంను కప్పి పుచ్చుకునేందుకు టీఆర్ఎస్ నాటకాలు అడుతోందని బీజెపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి అన్నారు. శుక్రవారం బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ హన్మకొండలో శనివారం జరిగే సభకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఎదుర్కోలేక టీఆర్ఎస్ గుండాలు దాడులకు పాల్పడుతూ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకోవాలని చూసినా హైకోర్టు పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. ఎంఐఎంతో కలిసిపాతబస్తీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రులు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంతో కలిసి పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు నన్నె ఉదయ్ ప్రతాప్, కో ఆర్డినేటర్ విద్యాసాగర్‌రెడ్డి, గెంటేల విద్యాసాగర్, నంబూరు రామలింగేశ్వరరావు, శ్యాం రాథోడ్, రవి రాథోడ్, మందా సరస్వతి, దొడ్డా అరుణ, అనంతు ఉపేందర్, సాంబశివరావు, కోటమర్తి సుదర్శన్, చావా కిరణ్, ప్రవీణ్, విజయ, కార్తీక్ పాల్గొన్నారు.
సింగరేణిలో అవినీతి అవాస్తవం
సత్తుపల్లి, వెలుగు: సింగరేణిలో రూ.1500 కోట్ల అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని డైరక్టర్లు చంద్రశేఖర్(ప్రాజెక్ట్స్), బలరామ్ నాయక్ (ఫైనాన్స్) తెలిపారు. శుక్రవారం సత్తుపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు కలెక్టర్ ఖాతాలో రూ.197 కోట్లు డీఎంఎఫ్ నిధులను జమ చేసినట్లు చెప్పారు. ఈ నిధులన్నీ కలెక్టర్ పర్యవేక్షణలో ఖర్చు చేయడం జరుగుతుందని, అవినీతికి అవకాశం లేదన్నారు. మైనింగ్ కారణంగా ఎన్టీఆర్ కాలనీలో ఇళ్లు దెబ్బతిన్నాయని, వారికి రూ.42 కోట్ల పరిహారం అందించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించగా, సంస్థ అప్పీల్ కు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను సంస్థ ఏర్పాటు చేసిన సర్వే టీమ్ పరిశీలించిందని, రిపేర్లు చేయించనున్నట్లు చెప్పారు. బ్లాస్టింగ్ తీవ్రతను తగ్గించడ, బ్లాస్టింగ్ ను పక్కన పెట్టి కొత్త టెక్నాలజీతో బొగ్గు తీస్తామని తెలిపారు. జేవీఆర్, కిష్టారం ఓసీపీల్లో ఏడాదికి 120 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, దీనికి సంబంధించి రూ.100 నుంచి రూ.110 కోట్లు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, రూ.5 నుంచి రూ.10 కోట్ల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్‌ను ప్రభావిత ప్రాంతాల డెవలప్మెంట్కు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. జీఎం జెక్కం రమేశ్, సీపీపీ నరసింహారావు, పీవోలు వెంకటచారి, నరసింహారావు పాల్గొన్నారు.
బాధితులకు నిత్యావసర సరుకులు
ఖమ్మం టౌన్, వెలుగు: గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలకు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు మూడు గ్రామాలకు రూ. 8 లక్షలు విలువ చేసే నిత్యావసర సరుకులను అందించారు. ఖమ్మంలో సరుకుల వాహనాన్ని శుక్రవారం టౌన్ ఏసీపీ ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. అసోసియేషన్ అధ్యక్షుడు తుంపాల కృష్ణమోహన్, సెక్రటరీ డి ప్రవీణ్, వి నాగేశ్వరరావు, పి శ్రీనివాస రావు, టి శ్రీనివాస్, నాగరామాచారి అన్నవరపు పాల్గొన్నారు.
ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన
భద్రాచలం, వెలుగు: ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి పేదలకు అందించాలని మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ అలవాల రాజా పెరియార్ డిమాండ్ చేశారు. మనుబోతుల చెరువు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలు శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. ఇంటి అద్దె కట్టుకోలేక, ఉండడానికి ఇల్లు లేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బొడ్డు సత్యనారాయణ, రమాదేవి, నరేశ్పాల్గొన్నారు.
స్వర్ణ కవచధారిగా రామయ్య
భద్రాచలం,వెలుగు:శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులను శుక్రవారం స్వర్ణ కవచాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి శ్రావణ శుక్రవారం కావడంతో లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకంతో పాటు లక్ష కుంకుమార్చన, అష్టోత్తరలక్ష్మీశతనామార్చన చేశారు. విష్ణుసహస్రనామ పారాయణం చేశాక ముత్తయిదువులకు మంజీరాలు పంపిణీ చేశారు. తర్వాత ప్రాకార మండపంలో రామయ్యకు నిత్యకల్యాణం జరిగింది. సాయంత్రం అద్దాల మండపంలో దర్బారు సేవ అనంతరం రామయ్యకు సంధ్యా హారతి ఇచ్చారు.
విద్యార్థుల క్యాటరింగ్ ఘటనపై విచారణ
పాల్వంచ,వెలుగు: మండలంలోని కిన్నెరసాని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం నుంచి ఏడుగురు విద్యార్థులు గురువారం కొత్తగూడెంలో జరిగిన ఓ ఫంక్షన్ కు క్యాటరింగ్ పనులకు వెళ్లిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొత్తగూడెంలో క్యాటరింగ్ చేస్తున్న విషయం తెలుసుకొని అధికారులు వారిని పట్టుకొని హాస్టల్ కు తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ జానునాయక్ ను విచారించారు. సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు విచారణకు ఆదేశించారు. ఐటీడీఏ డీడీ రమాదేవి, చైల్డ్ వెల్ఫేర్ జిల్లా అధికారి హరికుమార్, ట్రైబల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రెటరీ విజయలక్ష్మి విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు.
న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ఐలు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలకు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహ్మద్ జావీద్తో కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. సెక్షన్ 41(ఏ) సీఆర్పీసీని పోలీసులు దుర్వినియోగం చేయకుండా చట్టం తేవాలన్నారు. న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. కాంగ్రెస్ లీగల్‌సెల్ అధ్యక్షుడు జమ్ముల శరత్‌కుమార్‌రెడ్డి, వడ్డెబోయిన నరసింహారావు, పుచ్చకాయల వీరభద్రం, ఏలూరి రవి, సంపత్‌కుమార్, ముస్తఫా, స్వరూప్, శేఖర్ పాల్గొన్నారు.
రక్షణ చట్టాన్ని తీసుకురావాలె
భద్రాద్రికొత్తగూడెం: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర కార్యదర్శి కె. సత్యనారాయణ డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో ఐలూ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేలు జీవన భృతి కల్పించాలన్నారు. మహిళా న్యాయవాదులకు బార్ అసోసియేషన్‌లో ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. హైదరాబాద్‌లో న్యాయ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రమేశ్‌కుమార్ మక్కడ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీకి పర్మిషన్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అన్ని పర్మిషన్స్ వచ్చినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌తో కలిసి వివరించారు. ఈ ఏడాది150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్, హెల్త్ మినిష్టర్ హరీశ్‌రావు కృషితోనే కాలేజీకి పర్మిషన్స్ వచ్చాయని తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. కాలేజ్ సూపరింటెండెంట్ కుమారస్వామి, డాక్టర్లు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీకి పర్మిషన్స్ వచ్చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, హెల్త్ మినిష్టర్ లకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థుల క్యాటరింగ్ ఘటనపై విచారణ
పాల్వంచ,వెలుగు: మండలంలోని కిన్నెరసాని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం నుంచి ఏడుగురు విద్యార్థులు గురువారం కొత్తగూడెంలో జరిగిన ఓ ఫంక్షన్ కు క్యాటరింగ్ పనులకు వెళ్లిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొత్తగూడెంలో క్యాటరింగ్ చేస్తున్న విషయం తెలుసుకొని అధికారులు వారిని పట్టుకొని హాస్టల్ కు తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ జానునాయక్ ను విచారించారు. సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు విచారణకు ఆదేశించారు. ఐటీడీఏ డీడీ రమాదేవి, చైల్డ్ వెల్ఫేర్ జిల్లా అధికారి హరికుమార్, ట్రైబల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రెటరీ విజయలక్ష్మి విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు.
‘ప్రజల మధ్య ఉండాల్సిందే’
సత్తుపల్లి, వెలుగు: ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించకుండా ఇంటికే పరిమితం కావడం సరైంది కాదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శుక్రవారం క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసినముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై వార్డుల వారీగా సమీక్ష సమావేశాలు ఉంటాయని, స్థానిక నాయకత్వం ప్రజల మధ్యనే ఉండాలన్నారు. లైబ్రరీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలరాణి, జడ్పీటీసీ రామారావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, నాయకులు కొత్తూరు ప్రభాకరరావు, రఫీ, అంకమ రాజు, గ్రాండ్ మౌలాలి, మట్టా ప్రసాద్, చాంద్ పాషా, రఘు, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్ ను ముట్టడించిన వీఆర్ఏలు
ఖమ్మం టౌన్, వెలుగు: పే స్కేల్, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో సమ్మె చేపట్టిన వీఆర్ఏలు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. 33 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ధర్నా చౌక్ లో 48 గంటల మహాధర్నాలో భాగంగా కలెక్టరేట్ ముట్టడి చేపట్టి డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అంతకుముందు జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి వినతిపత్రం అందజేశారు. సమ్మెకు కేవీపీఎస్, పీడీఎస్ యూ నాయకులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు చల్లా లింగరాజు, జిల్లా కార్యదర్శి వెంకట్, మహిళా అధ్యక్షురాలు రమాదేవి, ఉపేందర్, జానీ, ప్రగతి పాల్గొన్నారు.
కామన్ విద్యావిధానం అమలు చేయాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దేశ వ్యాప్తంగా అందరికీ కామన్ విద్యావిధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు శుభం బెనర్జీ డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన సభలో శుభం బెనర్జీ మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే లక్ష్యంగా ఏఐఎస్ఎఫ్ పని చేస్తుందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న విద్యావిధానం ప్రమాదకరంగా ఉందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ స్టాలిన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ, సీపీఐ జిల్లా సెక్రెటరీ ఎస్కేశాబీర్ పాషా పాల్గొన్నారు.
గణేశ్ మండపాల ఖర్చులు చెల్లిస్తాం
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గణేశ్ మండపాలకు సంబంధించిన విద్యుత్, మైక్ పర్మిషన్ చార్జీలను పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెల్లించనున్నట్లు సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మం సిటీలో శుక్రవారం వర్తక సంఘ భవనంలో స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చవితి వేడుకల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. మండప నిర్వాహకులకు ఆఫీసర్లు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ విద్యుత్ అధికారులను సంప్రదించి విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. మేయర్ పూనకొల్లు నీరజ, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి, కన్వీనర్ కన్నం ప్రసన్న కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్లిక అంజయ్య, కోశాధికారి ములుగుండ్ల శ్రీహరి, ఉపాధ్యక్షుడు డౌలే సాయికిరణ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కారేపల్లి,వెలుగు:ప్రభుత్వ పథకాలను సద్వనియోగం చేసుకోవాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. కారేపల్లిలో దళితబంధు లబ్ధిదారుడికి మంజూరైన యూనిట్‌ను శుక్రవారం ప్రారంభించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, న్యాయవాది నర్సింగ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆదివాసీల ప్రత్యేక పూజలు గుండాల, వెలుగు: మండలంలోని చీమలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు శుక్రవారం పోతురాజు ఆలయంలో వాన దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీల సంప్రదాయాలతో వాన దేవుడికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
మెరుగైన వైద్యం కోసమే పల్లె దవాఖానాలు
పెనుబల్లి, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి పల్లెకు వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకే పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పాడు. 1887 మంది పెన్షనర్లకు కార్డులను, 51 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.51.05 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు గ్రామాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి పల్లె దవాఖానా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహనరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ఎంపీడీవో మహాలక్ష్మి, తహసీల్దార్ రమాదేవి, సర్పంచులు శ్యామలదేవి, సరోజిని, ఆర్డీవో సూర్యనారాయణ, డీఆర్డీవో విద్యాచందన, ఎఫ్డీవో సతీశ్పాల్గొన్నారు.
కొత్తగూడెం ఓఎస్డీగా సాయి మనోహర్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఓఎస్డీగా టి. సాయిమనోహర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. 1996 బ్యాచ్ ఎస్సైగా సెలెక్ట్ అయిన ఆయన 2007లో ఇన్స్పెక్టర్గా, 2013లో డీఎస్పీగా ప్రమోషన్ పొందారు. కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేశారు. అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పై కొత్తగూడెం ఓఎస్డీగా వచ్చారు. జిల్లా ఎస్పీ వినీత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పశువుల వ్యాన్ పట్టివేత చండ్రుగొండ,వెలుగు: పశువులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వ్యాన్ ను శుక్రవారం ఎస్సై విజయలక్ష్మి పట్టుకున్నారు. తనఖీలు చేస్తుండగా చండ్రుగొండ నుంచి జూలూరుపాడు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఆపకుండా వెళ్లడంతో వెంబడించడంతో ముత్యాలమ్మ ఆలయం వద్ద వ్యాన్ ఆపి డ్రైవర్ పారిపోయాడని ఎస్సై చెప్పారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 50 పశులను గోశాలకు తరలిస్తామని చెప్పారు.
రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలి
ములకలపల్లి, వెలుగు: రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ సొంత స్థలంలో రూ.5 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, ఊకంటి రవికుమార్, నిమ్మల మధు, గోగ్గల ఆదినారాయణ, గౌరి నాగేశ్వరావు, గోపగాని లక్ష్మీనరసయ్య, పొడియం వెంకటేశ్వర్లు, బుగ్గ వెంకట నరసమ్మ, బైరు ప్రసాద్, మంచాల సారయ్య పాల్గొన్నారు.
సీఆర్టీల వేతనాలు విడుదల చేయాలి
గుండాల, వెలుగు: సీఆర్టీల నాలుగు నెలల పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం మర్కోడులో మీడియాతో మాట్లాడుతూ సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలనెలా జీతాలు ఇవ్వాలని కోరారు. ఐటీడీఏ పరిధిలోని స్కూల్స్ కు మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకపోవడంతో టీచర్స్ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్, బిక్షమయ్య, బాల్ సింగ్, నాగేశ్వరరావు, ఎర్రయ్య, వసంతరావు, జోగయ్య, రాంబాబు, వెంకన్న, ప్రసాద్ రావు పాల్గొన్నారు .