
- సన్నబియ్యం పంపిణీకి హాజరుకాలేదని ఆసిఫాబాద్ డీసీఎస్‌వోకు షోకాజ్ నోటీసు
- రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారని పలువురు సస్పెన్షన్
ఆసిఫాబాద్, వెలుగు : సన్నబియ్యం పంపిణీకి హాజరుకాని ఆసిఫాబాద్ డీసీఎస్‌వోకు షోకాజ్ నోటీసు జారీ అయింది. మంగళవారం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఆసిఫాబాద్ డీసీఎస్‌వో బాబా వినోద్‌కుమార్ హాజరుకాకపోగా, బుధవారం సైతం ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించడంతో పాటు సోమవారం గ్రీవెన్స్‌కు డుమ్మా కొట్టడంతో డీసీఎస్‌వోకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
విరాసత్‌లో రూల్స్ పాటించలేదని డిప్యూటీ తహసీల్దార్ సస్పెన్షన్
కాగజ్‌నగర్, వెలుగు : కౌటాల డిప్యూటీ తహసీల్దార్ మాష్కూర్ అలీపై సస్పెన్షన్ వేటు పడింది. మష్కూర్ అలీ 2023లో చింతల మానేపల్లి ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పనిచేశారు. ఈ టైంలో బాలాజీ అనుకోడ శివారులో నీలం అశోక్ పేరిట ఉన్న ఎకరం భూమిని రిటైర్డ్ తహసీల్దార్ కామ్రే రావూజీ భార్య కామ్రే రేవాబాయి పేరిట విరాసత్ చేశారు. పట్టాదారుతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి అక్రమంగా విరాసత్ చేయడంతో బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా విచారణ చేపట్టి గత నెల 28 రిపోర్ట్‌ను కలెక్టర్‌కు అందజేశారు. అక్రమాలు నిజమేనని తేలడంతో డిప్యూటీ తహసీల్దార్ మష్కూర్ అలీని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆర్డర్స్ జారీ చేశారు.
కొండాపూర్ తహసీల్దార్ ట్రాన్స్‌ఫర్, ఆర్‌ఐ సస్పెన్షన్
కొండాపూర్, వెలుగు : వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరులో అవకతవకలకు పాల్పడిన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ తహసీల్దార్‌పై ట్రాన్స్‌ఫర్ వేటు పడగా, ఆర్‌ఐని సస్పెండ్ చేశారు. రెండు నెలల కింద కొండాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఆర్‌ఐ పంచనామా రిపోర్ట్ ఆధారంగా తహసీల్దార్ వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఇందులో అవకతవకలు జరిగినట్లు బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన కలెక్టర్ ఆరోపణలు నిజమేనని తేలడంతో తహసీల్దార్ ఎస్తేరు అనితను నారాయణఖేడ్ ఆర్డీవో ఆఫీస్ ఏవోగా ట్రాన్స్‌ఫర్ చేయగా, ఆర్‌ఐ మహాదేవును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆర్డర్స్ జారీ చేశారు.