సిట్‌‌కు శ్రవణ్‌‌ రావు టోకరా .. ట్యాపింగ్‌‌ ఫోన్​కు బదులు మరో ఫోన్‌‌ అందజేత

సిట్‌‌కు శ్రవణ్‌‌ రావు టోకరా .. ట్యాపింగ్‌‌ ఫోన్​కు బదులు మరో ఫోన్‌‌ అందజేత
  • ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా గుర్తించిన అధికారులు
  • అసలైన ఫోన్లతో ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసులు 

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరో నిందితుడైన శ్రవణ్‌‌ రావు రెండో రోజు విచారణలో భాగంగా బుధవారం సిట్​ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కోసం వినియోగించిన సెల్‌‌ ఫోన్లను సిట్‌‌కు అందిస్తానని చెప్పి.. దానికి బదులు సంబంధం లేని ఫోన్​ అందించినట్టు పోలీసులు గుర్తించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత నెల 29న శ్రవణ్‌‌ రావు సిట్‌‌ ముందు హాజరైన సంగతి తెలిసిందే. 

రెండో రోజు విచారణలో భాగంగా బుధవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రవణ్‌‌ రావు జూబ్లీహిల్స్ పీఎస్‌‌కు వచ్చాడు. ఇన్వెస్టిగేషన్‌‌ ఆఫీసర్‌‌ వెంకటగిరి ముందు హాజరయ్యాడు. తనతో తీసుకువచ్చిన ఓ మొబైల్‌‌ ఫోన్‌‌ను అందించాడు. ఫోన్‌‌ ఐఎంఈఐ నంబర్‌‌‌‌ను పరిశీలించిన సిట్‌‌ అధికారులు.. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ సమయంలో వినియోగించిన సెల్‌‌ ఫోన్‌‌ కాకుండా దానికి సంబంధం లేని ఫోన్‌‌ ఇచ్చినట్టు గుర్తించి శ్రవణ్​రావును నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన ఫోన్లను తమకు అప్పగించాలని.. ఇందుకోసం ఈ నెల 8న అసలైన సెల్‌‌ ఫోన్లతో తమ ముందు హాజరుకావాలని నోటీసులు అందించారు.

శ్రవణ్‌‌ రావు నాట్​ టు అరెస్ట్‌‌పై సుప్రీంకు సిట్‌‌

హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్​ను కొట్టివేసిన తరువాత శ్రవణ్‌‌ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అరెస్ట్‌‌ చేయకుండా విచారణ జరుపుకోవచ్చని శ్రవణ్‌‌ రావుకు గత నెల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే శ్రవణ్‌‌ రావు గత శనివారం సిట్‌‌ ముందు హాజరయ్యాడు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ నెల 28 వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి. అయితే, శ్రవణ్‌‌ రావుకు అనుకూలంగా వచ్చిన నాట్‌‌ టు అరెస్ట్‌‌ ఆర్డర్‌‌పై సిట్‌‌ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఇందుకుగాను గత నెల 29న జరిగిన విచారణలో సరైన సమాచారం ఇవ్వలేదని, సెల్‌‌ఫోన్లను అప్పగించడంలో తమకు సహకరించడం లేదని పేర్కొనే అవకాశం ఉంది. ఈ నెల 8న విచారణకు హాజరయ్యే సమయంలో శ్రవణ్‌‌ రావు వ్యవహరించే తీరుపై సిట్‌‌ సమగ్ర నివేదిక తయారు చేసిన తరువాత సుప్రీంను ఆశ్రయించనున్నట్టు తెలిసింది. అలాగే, ప్రభాకర్‌‌‌‌ రావుకు ముందస్తు బెయిల్‌‌ రాకుండా హైకోర్టులో పటిష్టమైన కౌంటర్ దాఖలు చేసేందుకు సిట్​అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫోన్‌‌ ట్యాపింగ్ సమయంలో రెండు సెల్‌‌ ఫోన్లు! 

గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌‌కు గురైన ఫోన్‌‌ నంబర్లు.. వాటిని ప్రణీత్‌‌ రావు టీమ్‌‌కు పంపించిన మొబైల్ ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా.. ట్యాపింగ్‌‌లో శ్రవణ్‌‌ రావు పాత్రను సిట్ అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్‌‌ రిపోర్ట్స్‌‌ ఆధారంగా ఫోన్ నంబర్లతో లింకైన ఐఎంఈఐ నంబర్లు గుర్తించారు. వీటిలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రవణ్‌‌ రావు నంబర్‌‌‌‌ నుంచి వెళ్లిన వాట్సాప్‌‌ చాటింగ్‌‌లు, ప్రణీత్‌‌ రావుకు ఆయన పంపించిన మొబైల్ నంబర్లను గుర్తించారు. 

ఈ క్రమంలోనే శ్రవణ్‌‌రావు నాలుగు ఐఎంఈఐ నంబర్లు గల రెండు సెల్‌‌ ఫోన్లను వినియోగించాడని సిట్‌‌ గుర్తించినట్టు తెలిసింది. వీటి ఆధారంగా శ్రవణ్‌‌ రావుకు ఇచ్చిన నోటీసుల్లో ఆయా ఫోన్ నంబర్లకు చెందిన ఐఎంఈఐ నంబర్లను కూడా పేర్కొన్నట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా వీటిని తమకు స్వాధీనం చేయాలని సిట్‌‌ ఆదేశించింది. మొదటిరోజు విచారణ సమయంలోనూ తదుపరి విచారణకు ఆ రెండు ఫోన్లను తీసుకురావాలని సూచించారు.