
- తడిసి మోపడవుతున్న ఖర్చులు
- అడుగంటుతున్న తపాస్పల్లి రిజర్వాయర్
సిద్దిపేట, వెలుగు: సాగునీటి కోసం కొత్త బోర్లు వేసినా నీళ్లు పడక అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ లో నీళ్లు అడుగంటడంతో యాసంగి పంటను రక్షించుకోవడం కోసం కొత్త బోర్లు వేస్తున్నా ఫలితం ఉండడం లేదు. రెండు నెలల కాలంలో అనేక మంది రైతులు ఒకటి నుంచి మూడు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. దీంతో పంట పెట్టుబడితో పాటు బోర్ల కోసం చేసిన అప్పులు రైతులకు గుది బండగా మారాయి. కండ్ల ముందు పంట ఎండిపోతుంటే తట్టుకోలేక కొంతమంది అప్పులు చేసి బోర్లు వేస్తున్నా ఏదో ఒకచోట కొద్దిపాటి నీరు పడడంతో వాటితో నెట్టుకొస్తున్నారు. అయినప్పటికీ సగానికి పైగా పంటలు ఎండిపోతూనే ఉన్నాయి.
పడిపోయిన భూగర్భజలాలు
చేర్యాల సబ్ డివిజన్ లో రోజు రోజుకు భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరుకు దాదాపు 2.58 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. యాసంగిలో తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నీల్లు అందకపోవడంతో బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరింతగా దిగజారింది. ప్రస్తుతం చేర్యాలలో 11.13, ధూల్మిట్టలో 12.82, మద్దూరులో 9.47, కొమురవెల్లిలో 9.52, కొండపాకలో 9.59 మీటర్ల దిగువకు భూగర్భజలాలు పడిపోయాయి.
ధూల్మిట్ట, మద్దూరు మండలాల్లో పరిస్థితి మరింత దిగజారిపోయింది. యాసంగిలో తపాస్పల్లి రిజర్వాయర్ రైతుల ఆశలను గల్లంతు చేసింది. ఈ రిజర్వాయర్ నుంచి ఏటా చేర్యాల సబ్ డివిజన్ లోని పలు చెరువుల్లోకి నీటిని ఎత్తి పోసేవారు. కానీ ఈ ఏడాది ఎత్తిపోయక పోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా వరి పొట్ట దశకు వచ్చే సమయంలో నీళ్లు అందక సగానికి పైగా పంట ఎండిపోతోంది.
ఈ ఫొటోలోని రైతు పేరు మేడికుంట శ్రీనివాస్. కొమురవెల్లిలో తనకున్న 12 ఎకరాల్లో తొమ్మిదెకరాల్లో వరి వేయగా మిగిలిన భూమిలో బంతి, కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈ సీజన్ లో తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల కాకపోవడంతో వరి పంటకు నీరందని పరిస్థితి నెలకొంది. గత రెండు నెలల కాలంలో రూ.2 లక్షలు వెచ్చించి మూడు బోర్లు వేసినా నీరు పడలేదు. మరోవైపు యాసంగిలో వేసిన వరి సగానికి పైగా ఎండిపోయింది. ఇది ఒక్క శ్రీనివాస్ పరిస్థితి మాత్రమే కాదు చేర్యాల సబ్ డివిజన్ లో చాలామంది రైతులు కొత్త బోర్లు వేస్తూ నీళ్లుపడక చాలామంది ఆర్థికంగా చితికిపోతున్నారు.
రెండు బోర్లలో నీళ్లు పడలేదు
ప్రస్తుత సీజన్ లో వరి పంటను రక్షించుకునేందుకు రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. రిజర్వాయర్ నుంచి నీళ్లు వస్తాయనే ఆశతో ఏడెకరాల్లో వరి వేసినా. నీళ్లందక మొత్తం పంట ఎండిపోయింది. పంటకు పెట్టిన పెట్టుబడితో పాటు బోర్ల కోసం చేసిన ఖర్చులు ఇప్పుడు తడిసి మోపడయ్యాయి. చిక్కుడు అంజయ్య, రైతు, కొమురవెల్లి
భూగర్భజలమట్టాలు పడిపోయిన క్రమం
మండలం జనవరి ఫిబ్రవరి మార్చిలో
చేర్యాల 8.73 9.97 11.13
ధూల్మిట్ట 9.50 9.86 12.82
మద్దూరు 8.09 8.89 9.47
కొమురవెల్లి 5.56 7.27 9.52
కొండపాక 7.25 8.71 9.59