ఇర్కోడ్ గ్రామ మహిళలు నాన్వెజ్ వెరైటీ పచ్చళ్లు తయారుచేస్తున్నారు. నోరూరించే స్నాక్స్ అందిస్తున్నారు. మీకూ ఆ ముక్క పచ్చళ్లను టేస్ట్.. చూడాలనుందా..? అయితే ఛలో సిద్దిపేట..
రాత్రి పది గంటలు.. సిద్ధిపేట జిల్లా రాఇర్కోడ్ విలేజ్. గ్రామస్తులంతా భోజనాలు చేసి నిద్రకు రెడీ అవుతున్నారు. ఊరి చివర్లో ఉన్న మహిళా సమాఖ్య భవన్ 'లో మాత్రం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. "పచ్చళ్లు తయారీకి ఏయే ఐటమ్స్ కావాలి. అని లిస్టు రాసుకుంటూ ఒకరు, 'నాటుకోళ్లు, మేకలను ఆర్డర్ చేశారా' అంటూ మరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఊళ్లలో రాత్రి తొమ్మిది కొట్టగానే నిద్రలోకి జారుకుంటారు. . కానీ పది అయినా పని గురించి ఆలోచిస్తున్నారు. 'ఇర్కోడ్ మహిళా సమాఖ్య " మహిళలు.
వాళ్లంతా గ్రామీణ మహిళలు... బీడీలు చుడితేనే బతుకు బండి నడుస్తుంది. లేదంటే పస్తులు ఉండాల్సిందే. వేరే మార్గం లేక బీడీలు చుడుతూ పొట్ట నింపుకునేవాళ్లు. దాని వల్ల కాస్తో కూస్తో ఆదాయం అయితే దొరికింది. కానీ బీడీల మాటున దగ్గ దమ్ము క్యాన్సర్ లాంటి జబ్బులు గుప్పుమనేవి. 'ఏం చేస్తం.. మా కర్మ ఇంతే అంటూ పనిచేసేవాళ్లు కొందరు. "భవిష్యత్తు బాగుండాలంటే కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి" అని ఆలోచించేవాళ్లు. మరికొందరు. కష్టమైనా ఇష్టంతో ఒక్కటయ్యారు. అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టారు. 'మీట్ ఆన్ వీల్స్' అంటూ నోరూరించే చికెన్, మటన్ పచ్చళ్లు, స్నాక్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు
సిద్ధిపేట పచ్చళ్లకి ఫుల్ డిమాండ్.
బీడీలు చుట్టి.. కూలీ చేసి.. సిద్ధిపేట చుట్టుపక్కల ఏ గ్రామానికి వెళ్ళినా అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఆపల్లెలు సమస్యలతో సావాసం చేసేవి. అధికారుల చొరవ, నాయకుల కృషి, మహిళా సంఘాల సమాఖ్య ఆచరణతో ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్నాయి. ఇర్కోడ్ విలేజ్ కూడా ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉండేది. మగవాళ్ళంతా కూలీ పనులకు వెళ్తే.. ఆడవాళ్లు బీడీలు చుడుతూ పొట్టనింపుకునేవాళ్లు. ఊళ్లో ఎక్కువ మంది బీడీలను చుట్టడమే ఉపాధిగా చేసుకున్నారు. అవగాహన లేకనో, వేరే మార్గం లేకనో బీడీలు చుట్టేవాళ్లు. దాంతో కొంతమంది దగ్గు, దమ్ముతో బాధపడేవాళ్లు. క్యాన్సర్ బారిన పడినవాళ్లు కూడా ఉన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలనుకుంది 'ఇర్కోడ్ మహిళా సమాఖ్య ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేయడం నేర్చుకుంది. ఉపాధికి మార్గాలను వెతికింది. మార్పును స్వీకరించడం మొదలుపెట్టింది.
సెర్ఫ్ సాయంతో...
జాతీయ మాంస పరిశోధనా సంస్థ (సెర్చ్) _గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు. 'పచ్చళ్ల తయారీ" చేసే అవకాశం కల్పించింది. స్థానిక నాయకులు ఈ స్కీమ్ ఇర్కోడ్ గ్రామంలో బాగుంటుందని, మహిళలకు అవకాశం ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారనే ఉద్దేశంతో పచ్చళ్ల తయారీలో శిక్షణ ఇవ్వాలనుకున్నారు. "అప్పటి వరకు కూలీ పనులు చేస్తూ, బీడీలు చుడుతూ బతికేవాళ్లం. చికెన్, మటన్ పచ్చళ్లు అంటే ఎవరూ ముందుకు రాలేదు. మేం మాత్రం ముందుకొచ్చాం. ఇరవై మందిని ట్రైనింగు సెలెక్ట్ చేశారు. 'ఆడవాళ్లు మటన్ కొట్టడం ఏంటీ' అని ఏవో కారణాలు చెప్పి కొంతమంది తప్పుకున్నారు. చివరకు తొమ్మిది మంది మాత్రమే మిగిలాం. "కష్టమైనా సరే నాన్ వెజ్ పచ్చళ్లు తయారీ చేద్దాం' అని ఒకొరికొకరం సర్ది చెప్పుకున్నాం. వారం రోజులు హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకున్నాం" అని తమ జర్నీ ఎలా మొదలైందో చెప్పారు. 'ఇర్కోడ్ మహిళా సమాఖ్య'లోని ఒక మెంబర్.
ALSO READ | న్యూ ఇయర్ కి కొబ్బరి స్వీట్స్ తో వెల్కమ్ చెప్పండి.. సింపుల్ రెసిపీస్ ఇవిగో..
రెండు లక్షల పెట్టుబడితో...
పచ్చళ్లు ఏవిధంగా తయారుచేయాలో నేర్చుకున్నారు. ప్రభుత్వం మెషిన్లు ఇచ్చింది. కానీ సమస్య అంతా పెట్టుబడితోనే. మందాడి చందన, లావణ్య, లక్ష్మి, లాస్య, పద్మ, మౌనిక, స్వప్న, మంజుల, లక్ష్మి తొమ్మిది మంది కలిసి రెండు లక్షలకుపైగా పోగు చేసుకున్నారు. ఇర్కోడ్ గ్రామంలో ఒక భవనంలో పచ్చళ్ల తయారీని మొదలుపెట్టారు. "మూడు నెలల క్రితమే మా పని మొదలైంది. ఒకరికి కష్టమైతే, మరొకరు సాయం చేస్తరు. కొందరు మటన్, చికెన్ క్లీన్ చేస్తే, ఇంకొందరు అందులోకి కావాల్సిన మసాలాలు, దినుసులు సిద్దం చేస్తరు. మరో ముగ్గురు తయారుచేసిన పచ్చళ్లను మార్కెట్ కు తరలించి అమ్ముతారు. ఉదయం పది గంటలకు మొదలయ్యే పని.. ఒక్కోసారి రాత్రి పది గంటలయినా ఒడువదు. ప్రాసెస్ ను మధ్యలో ఆపితే.. పచ్చళ్లు కరాలు అవుతాయి. అందుకే పని అయ్యాకే ఇంటికి వెళ్తాం' అన్నది సమాఖ్య సభ్యురాలు మందాడి చందన
తాజా మాంసంతో..
ఆరోగ్యకరమైన నాటుకోళ్లు, గొర్రెలు, మేకలను హలాల్ చేయించి వాడతారు. శుచీ శుభ్రత పాటించి చికెన్, మటన్ పచ్చళ్లను తయారుచేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్గానిక్ మీట్ ను పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. 'మేక, గొర్రె ఆరోగ్యమైందా కాదా?... అని వెటర్నరీ డాక్టర్తో టెస్ట్ చేయిస్తారు. ఆ తర్వాతనే పనిలోకి దిగుతారు. వారానికి ఎన్ని పచ్చళ్లు తయారుచేశారు? ఎంత మార్కెట్ అయిందో రికార్డ్ చేసుకుంటారు.
మీట్ ఆన్ వీల్స్
చికెన్, మటన్ పచ్చళ్లు తయారుచేసే వాళ్లు తెలంగాణలో తక్కువే. నాన్వెజ్ పచ్చళ్లు అనగానే చాలామంది ఇష్టం చూపుతున్నారు. 'మీట్ ఆన్ వీల్స్" తో జనాల దగ్గరికి వెళ్తున్నారు. తాజా చికెన్, మటన్తో అక్కడికక్కడే స్నాక్స్ చేసిస్తారు. కొద్ది రోజుల్లోనే 'మీట్ ఆన్ వీల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చికెన్, మటన్ పచ్చళ్లతో పాటు చికెన్ పకోడి. సమోసా, వింగ్స్ తయారుచేస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో జనం ఉండే దగ్గరకు వెళ్తూ.. నోరూరించే పచ్చళ్లు, స్నాక్స్ అమ్ముతున్నారు.
V6 వెలుగు