లక్ష్యానికి చేరువగా.. ఇప్పటి వరకు 88 శాతం సెస్​ వసూలు చేసిన మార్కెట్ ​కమిటీలు

లక్ష్యానికి చేరువగా.. ఇప్పటి వరకు 88 శాతం సెస్​ వసూలు చేసిన మార్కెట్ ​కమిటీలు
  • 3 కమిటీలు వందశాతం పైగా ఆర్జించగా, 5 తొంభై శాతం పైగా ..
  • వెనుకబడిన ఒంటి మామిడి మార్కెట్​యార్డ్​

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని మార్కెట్ యార్డులు నిర్దేశిత లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. జిల్లా మార్కెటింగ్​శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరానికి వివిధ మార్కెట్ కమిటీల ద్వారా రూ.35 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా మార్చి రెండో వారం వరకు రూ.30 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. జిల్లాలో మొత్తం 14 మార్కెట్ కమిటీలుండగా ఒక్క ఒంటి మామిడి మార్కెట్​లో మాత్రమే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తం మార్కెట్ కమిటీల్లో 3 వంద శాతానికి పైగా, 5 తొంభై శాతానికి పైగా ఆదాయాన్ని ఆర్జించాయి. ఇప్పటివరకు 88 శాతం ఆదాయం సమకూరగా మార్చి ముగిసే నాటికి లక్ష్యాలను సాధిస్తామని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా 2023–-24  ఆర్థిక సంవత్సరంలో  రూ.34 .39 కోట్ల లక్ష్యానికి రూ. 27.18 కోట్ల ఆదాయం ఆర్జించాయి.  

జిల్లాలో 14 మార్కెట్ కమిటీలు

జిల్లాలో సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, హుస్నాబాద్, బెజ్జంకి, చిన్నకోడూరు, నంగునూరు, దౌల్తాబాద్, కోహెడ మార్కెట్ కమిటీలతో పాటు జక్కాపూర్, కుకునూరుపల్లి, తోటపల్లి, బచ్చన్నపేటల్లో  4 సబ్ మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయి. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ మార్కెట్ యార్డుల్లో ఈ నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలోని చేర్యాల, మిరుదొడ్డి, బెజ్జంకి మార్కెట్ కమిటీలు నిర్దేశిత లక్ష్యాల కంటే 20 శాతం అధికంగా ఆదాయాన్ని ఆర్జించాయి. ఈ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో వరి, పత్తి కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుండడంతో సెస్ రూపంలో ఆదాయం ఎక్కువగా లభించింది. మార్కెట్​కమిటీలు రైతుల పంట ఉత్పత్తులు, కొనుగోలు చేసే వ్యాపారులు, రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, ఇతర ఏజెన్సీల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేస్తాయి. 

ఒంటి మామిడిలో కూరగాయలు మాత్రమే..

జిల్లాలోని 13 మార్కెట్ కమిటీలు పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరిపితే ములుగు మండలంలోని ఒంటి మామిడి మార్కెట్ యార్డులో కేవలం కూరగాయల విక్రయాలే జరుగుతాయి. ఉదయం, సాయంత్రం నిర్వహించే మార్కెట్ కు హైదరాబాద్ కు చెందిన వ్యాపారులు కొనుగోలు కోసం ఎక్కువగా వస్తారు. ఏటా దాదాపు రూ.3 కోట్ల మేర సెస్ రూపకంగా మార్కెట్ కమిటీకి ఆదాయం వస్తోంది. ఇటీవల మార్కెట్ యార్డు ముందు రోడ్డుపైనే విక్రయాలు జరుగుతుండడంతో మార్కెట్ కమిటీకి వచ్చే సెస్ కు గండిపడుతోంది. ఈ ఏడాది రూ.2.78 కోట్ల లక్ష్యానికి ఇప్పటి వరకు రూ.1.98 కోట్ల ఆదాయం లభించింది. నిర్దేశిత లక్ష్యంలో 71 శాతం మాత్రమే సెస్ వసూలు కావడంతో వంద శాతం లక్ష్యం సాధించే పరిస్థితి కనిపించడం లేదు. 

లక్ష్యాలను సాధిస్తాం

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు  ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు 88 శాతం సెస్ వసూళ్లు జరగగా మార్చి ముగిసేనాటికి వంద శాతం లక్ష్యాలను సాధిస్తాం. మార్కెటింగ్ శాఖ సిబ్బంది సెస్ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల లక్ష్య సాధన సులువైంది. - నాగరాజు, జిల్లా మార్కెటింగ్ అధికారి