ఆర్డీవో ఆఫీసు ముందు పల్లెపహాడ్ ​భూ​నిర్వాసితుల ఆందోళన

ఆర్డీవో ఆఫీసు ముందు పల్లెపహాడ్ ​భూ​నిర్వాసితుల ఆందోళన

సిద్దిపేట రూరల్, వెలుగు: తమ సమస్యల పరిష్కారానికి  నెలల తరబడి ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహడ్​​కు చెందిన పలువురు భూ నిర్వాసితులు వాపోయారు.  బుధవారం  గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ నుంచి మల్లన్నసాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ నుంచి గ్రామస్తులు సిద్దిపేట ఆర్డీవో ఆఫీస్ కు వచ్చారు. ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో అక్కడే గంటల తరబడి ఎదురుచూసి నిరసన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  తాము మల్లన్న సాగర్ నిర్మాణం కోసం సర్వం కోల్పోయి ఆర్అండ్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నామన్నారు. 

తమలో చాలా మంది నిర్వాసిత మహిళల భర్తలు చనిపోయారని, వారి భర్తల పేర్ల నుంచి వారి పేర్ల పైకి ఇండ్లు విరాసత్ చేయాలని ఎన్నిసార్లు కోరినా  ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని వాపోయారు. 18 సంవత్సరాలు నిండి 5 లక్షల ప్యాకేజీ  తీసుకున్న వారికి  ప్లాట్ ఇస్తానని ఇంకా ఇవ్వలేదని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణ, గుడూరి యాదమ్మ, అజ్మీరా కమలమ్మ, రుద్రారం పుష్ప, గౌరమ్మ, రామవ్వ తదితరులు పాల్గొన్నారు.