ఐటీ కంపెనీల్లో సైలెంట్ లేఆఫ్స్.. హైదరాబాద్ లోనే 4,500 మంది ఉద్యోగులు ఔట్​

ఐటీ కంపెనీల్లో సైలెంట్ లేఆఫ్స్.. హైదరాబాద్ లోనే 4,500 మంది ఉద్యోగులు ఔట్​
  •     గత 3 నెలల్లో దేశవ్యాప్తంగా 10 వేల మందిపై వేటు  
  •     ఏఐ రాకతో జాబ్స్​ పోతున్నాయంటున్న టెక్​ నిపుణులు

మాదాపూర్, వెలుగు: హైదరాబాద్​లోని ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీ లో నర్సింహ అనే యువకుడు 2020 ఏప్రిల్​నుంచి టెక్నాలజీ సపోర్ట్​ స్పెషలిస్ట్​గా పని​చేస్తున్నాడు. అయితే ఆరు నెలలుగా నర్సింహకు ప్రాజెక్టు ఇవ్వకుండా బెంచ్​కే పరిమితం చేశారు. ‘‘మీరు ప్రాజెక్ట్ తెచ్చు కోలేకపోయారు. మీ వల్ల కంపెనీకి ఫైనా న్షియల్​గా ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ అని పేర్కొంటూ ఈ ఏడాది ఫ్రిబవరిలో నర్సింహను రిజైన్ చేయాలని బెంచ్ మేనేజర్ ఒత్తిడి చేశారు. అదే నెలలో నర్సిం హతో డైరెక్ట్ మీటింగ్​ ఏర్పాటు చేసిన​ మేనే జర్.. రిజైన్ లెటర్​పై బలవంతంగా సంతకం చేయించుకుని అతణ్ని పంపించి వేశారు.  

ఇలా ఒకరిద్దరు కాదు.. వేలాది మందిని ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ‘‘ప్రాజెక్టులు లేవు.. పనితీరు సరిగ్గా లేదు” అని పేర్కొంటూ సైలెంట్​ లేఆఫ్స్ చేపడుతున్నాయి. ప్రాజెక్టులు, స్కిల్స్ లేవని చెబుతూ రిజైన్ చేయాలని బెంచ్​పై ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. వాళ్లతో ఎలాగోలా రిజైన్ చేయించి, ఇంటికి పంపించి వేస్తున్నాయి. ఇలా సైలెంట్ లేఆఫ్స్ కారణంగా దేశవ్యాప్తంగా గత మూడు నెలల్లో 10 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐటీ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్​లోనే 4,500 మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ లేఆఫ్స్​మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఎందుకిలా?  

ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సైలెంట్ లేఆఫ్స్ కు ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అని​ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్ ​కాస్ట్​ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగులను తొలగిస్తే జీతాల భారం తగ్గుతుందని భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బెంచ్ పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో ఏఐ వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్  టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషీన్ ​లర్నింగ్, డేటా అనలిటిక్స్ ​వంటి కోర్సులు నేర్చుకున్నోళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే చాన్స్​ ఉందని చెప్పారు.

కొత్త కోర్సులు నేర్చుకోవాలి.. 

సైలెంట్​లేఆఫ్స్​కారణంగా చాలా మంది ఐటీ ఉద్యోగులు జాబ్స్​ కోల్పోతున్నారు. గత మూడు నెలల్లో దేశవ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏఐ రాకతోనే కంపెనీలు లేఆఫ్స్​ చేపడుతున్నాయి. రానున్న రోజుల్లో ఏఐ వాడకం మరింత పెరిగే అవకాశం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీకి ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలి. ఏఐ, రోబోటిక్స్ వంటి కోర్సులు నేర్చుకోవాలి. 

 నల్లమోతు శ్రీధర్, ఐటీ ఎక్స్​పర్ట్