
మణిరత్నం డైరెక్షన్‌లో ఒక్కసారైనా నటించాలని ఎంతోమంది స్టార్స్ కోరుకుంటారు. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ నటించే అవకాశాన్ని అందుకుంటున్నాడు శింబు. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రం జూన్ 5న విడుదల కాబోతోంది. ఇందులో కీలకపాత్ర పోషించిన శింబు.. మణిరత్నం తెరకెక్కించబోయే తర్వాతి చిత్రంలోనూ హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఇప్పటికే మణిరత్నం డైరెక్షన్‌లో ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో నవాబ్) చిత్రంలో నటించాడు శింబు. అందులో తన వర్కింగ్ స్టైల్ నచ్చి ‘థగ్ లైఫ్’లో మరో అవకాశం ఇచ్చారు మణిరత్నం. ఇప్పుడు వీరి కాంబోలో ఇప్పుడు మూడో సినిమా రాబోతోంది. ఇక ప్రస్తుతం ‘పార్కింగ్’ ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు శింబు. కయాదు లోహర్ ఇందులో హీరోయిన్. శింబు కెరీర్‌లో ఇది 49వ చిత్రం. ఆ తర్వాత దేశింగ్ పెరియాసామి, అశ్విన్ మారిముత్తు డైరెక్షన్‌లో నటించాల్సి ఉంది. మరి 50వ చిత్రం మణిరత్నం సినిమా అవుతుందా లేక వీరిలో మరొకరితో అవుతుందో అనే ఆసక్తి నెలకొంది.