
- చర్చల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని నాడు అగ్రిమెంట్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్ భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నది. పాక్ పౌరులకు వీసాలు రద్దు చేయడం, సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ–వాఘా సరిహద్దును మూసివేయడం, ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకున్నది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా భారత చర్యలనే కాపీ కొట్టింది. భారత్ తీసుకున్న నిర్ణయాలకు స్పందనగా పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. భారత్ తో తమకు ఉన్న దౌత్య సంబంధాలను రద్దు చేసుకోవడంతో పాటు సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటామని ప్రకటించింది.
ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1971లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్.. సిమ్లా ఒప్పందానికి దారి తీసింది. 14 రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో నాటి తూర్పు పాకిస్తాన్ ను (ఇప్పుడున్న బంగ్లాదేశ్) భారత సైన్యం విముక్తి చేసింది. ఆ యుద్ధంలో 90 వేల మందికిపైనే పాకిస్తాన్ సైనికులు భారతదేశానికి లొంగిపోయారు. అలాగే, పశ్చిమ పాకిస్తాన్‌లోని దాదాపు 5 వేల చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని కూడా భారత్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ యుద్ధం జరిగిన దాదాపు 16 నెలల తర్వాత అంటే 1972 జులై 2న నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, నాటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈ ఒప్పందం కుదిరింది.
రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం ఏర్పడితే శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవడం సిమ్లా ఒప్పందం ఉద్దేశం. ఈ ఒప్పందంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. మూడో దేశం లేదా సంస్థ జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇరు దేశాల అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ తమతమ బలగాలను భారత్ – పాక్ ఉపసంహరించుకోవాలి.
పరస్పర అంగీకారంతో కాశ్మీర్‌లోని ఎల్ఓసీని రెండు దేశాలు గుర్తించాలి, గౌరవించాలి. ఎల్ఓసీని ఎవరూ కూడా ఏకపక్షంగా మార్చడానికి వీల్లేదు. ఎల్ఓసీకి సైనికులు ఎంత దూరంలో ఉండాలో కూడా ఈ ఒప్పందం ద్వారానే నిర్ణయించారు. శాంతిని కాపాడేందుకు, రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇందిరా గాంధీ, జుల్ఫికర్ భుట్టో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇక ఈ ఒప్పందం 1972 ఆగస్టు 4న అమల్లోకి వచ్చింది. తర్వాత 90 వేల మంది పాకిస్తాన్ సైనికులను బేషరతుగా
భారత్ విడుదల చేసింది. తాను ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా భారత్.. పాక్ కు తిరిగి ఇచ్చేసింది. పాకిస్తాన్ కూడా కొంతమంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. కాగా.. పహల్గాంలో టెర్రర్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పాకిస్తాన్ కూడా పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని తెలిపింది.