- సన్నాలు పండించిన రైతులు హైరానా
- గోదాంల కోసం ఆఫీసర్ల తంటాలు
- జిల్లాకు చేరని హైడ్రో మీటర్లు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 15 రోజుల పైనే అవుతున్నా.. నేటికీ కొనుగోళ్లు షురూ కాలేదు. దీంతో రైతులు చాలామంది ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.బోనస్ వస్తుందనే ఆశతొ సన్న వడ్లు పండించిన రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో ఈనెలారంభంలో మొదలైన వరి పంట కోతలు మరో 10 రోజుల్లో ముగియనున్నాయి. దసరాకు ముందు జిల్లాలో 250 దాకా సర్కారు వడ్ల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశారు. కానీ ఇప్పటి వరకు కాంటలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ముందస్తు సీజన్
ఇతర జిల్లాలకంటే నిజామాబాద్ లో వరినాట్లుతొలకరి వర్షాల నాటికే దాదాపు ముగుస్తాయి. ఈ రకంగా ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 4.30 లక్షల ఎకరాలలో రైతులు వరి పంట వేశారు . మద్దతు ధరకు తోడు అదనంగా రూ.500 బోనస్ ప్రకటించడంతో 4.02 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. దాంట్లోనూ గవర్నమెంట్ ప్రకటించిన 33 రకాలనే ఎంచుకున్నారు. ఇప్పటికి సుమారు రెండున్నర లక్షల ఎకరాలలో పంట కోతలు ముగిశాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన మిల్లర్లు పచ్చివడ్లకు మొదట్లో రూ.2,300 చెల్లించారు. లాభసాటిగా ఉందని భావించి రైతులు వారికే అమ్మారు. ఇప్పుడు రూ2,100 తగ్గించడంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటలు ఎప్పుడు మొదలువుతాయని ఎదురు చూస్తున్నారు.
629 కొనుగోలు సెంటర్ల ప్లాన్
ఖరీఫ్ సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన ఆఫీసర్లు 8 లక్షల టన్నుల సేకరణకు ప్లాన్ చేసి, 629 కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికి 250 ఓపెన్ చేశారు. డిఫాల్ట్ లిస్టులో ఉన్న 39 రైస్ మిల్స్‌ను పక్కనబెట్టి సన్న, దొడ్డురకం వడ్లను ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన మిల్స్‌ను ఎంపిక చేశారు. అయితే సర్కారు తోలే వడ్ల విలువకు సమానంగా మిల్లర్ ఇవ్వాల్సిన బ్యాంక్ గ్యారెంటీ, కస్టం మిల్లింగ్ కింద ఇవ్వాల్సిన బియ్యం విషయంలో రైస్ మిల్లర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
వారిని పక్కనబెట్టి రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లు నిల్వ చేయడానికి గోదాంల షార్టేజ్ ఉంది. బోధన్‌లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీ, సారంగాపూర్ ఎన్సీఎస్ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీ గోదాంలు వాడుకుంటే సమస్య తీరుతుందని భావిస్తున్నా.. ఇంత తక్కువ టైంలో వాటికి రిపేర్లు చేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. దీంతో మిల్లర్లు బాకీ ఉన్న కస్టం మిల్లింగ్ రైస్ సేకరణ స్పీడప్ చేసి గోదాంలు ఖాళీ చేయించడంపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు.
మరో పక్క సన్నరకం వడ్లను గుర్తించే హైడ్రో మీటర్లు జిల్లాకు ఇంకా చేరలేదు. వాటి వినియోగంపై ఏఈవోలకు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. 1.20 కోట్ల గన్నీ బ్యాగ్‌లు టర్ఫాలిన్లు రావాల్సి ఉంది. కోనుగోళ్లు మొదలుపెట్టడానికి అవరోధంగా మారిన ప్రతి అంశంపై దృష్టిపెడితేగానీ కాంటాలు స్టార్ట్కావు. మద్ధతు ధరకు తోడు రూ.500 బోనస్ ఆశతో ఉన్న చిన్న రైతులు ఇంకా కళ్లాల దగ్గరే నిద్రిస్తున్నారు.
సర్కారు కాంట కోసం చూస్తున్న..
మా విలేజ్‌లో 15 ప్రభుత్వ వడ్ల కొనుగోలు సెంటర్‌ను ఓపెన్ చేసి 15 రోజులు దాటింది. కానీ కాంట పెట్టలేదు. బోనస్ ఆశతో 10 ఎకరాలలో సన్నరకం వరి పంట సాగుచేసి కోతలు ముగించిన. వడ్లు ఆరబెట్టి రెండు వారాలు దాటింది. కాంట ఎప్పుడు పెడతారో అర్థంకావట్లే. కాసుల రవి, రైతు, రుద్రూర్