5 ఏండ్లలో 18 వేల మొక్కలు

5 ఏండ్లలో 18 వేల మొక్కలు
  • సింగరేణి సీఎండీ ఎన్​.బలరామ్​ పర్యావరణ యజ్ఞం
  • మియావాకీ పద్ధతిలో సింగరేణిలో చిట్టడవుల పెంపకం
  • బలరాం కృషిఫలితంగా 12 ప్రాంతాల్లోని 34 చోట్ల మినీ ఫారెస్టులు

హైదరాబాద్​, వెలుగు: ఆయన ఓ సివిల్​సర్వీస్​అధికారి. తెలంగాణకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి సంస్థకు సీఎండీ. క్షణం కూడా తీరిక ఉండదు. అయినా సరే పచ్చదనాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో మొక్కలు నాటడాన్ని ఓ యజ్ఞంలా చేపట్టారు. 

ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదేండ్లలో సింగరేణి అంతటా 18 వేల మొక్కలు నాటారు ఎన్. బలరామ్.  ఆయన కృషితో సింగరేణి వ్యాప్తంగా 12 ప్రాంతాల్లోని 34  ప్రదేశాల్లో మినీ ఫారెస్టులు అవతరించాయి. మ‌‌హ‌‌బూబ్‌‌న‌‌గ‌‌ర్‌‌ జిల్లాలో పేద గిరిజన కుటుంబంలో జన్మించిన ​బలరామ్​కు చిన్నప్పటి నుంచి మొక్కలపై ప్రత్యేకమైన ఆసక్తి. చిన్నతనంలోనే నర్సరీకి వెళ్లి తన గ్రామానికి వచ్చే దారిలో అనేక మొక్కలు నాటారు.

సింగరేణి సంస్థలో డైరెక్టర్ ఫైనాన్స్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  తన చిరకాల స్వప్నమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేశారు.

అలా పురుడు పోసుకుంది.. 

2019లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న బలరామ్​ 108 మొక్కలను నాటారు. అప్పటి నుంచి తన యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. అనంతరం సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో దాదాపు 40 ప్రాంతాల్లో ప్రతి చోటా 150 నుంచి 1250 మొక్కలను నాటడం మొదలుపెట్టారు. రామగుండంలోని మూడు ఏరియాల్లో 120 అడుగుల ఎత్తులో ఉన్న ఓపెన్ కాస్ట్–1 డంపు యార్డు పైన ఆయన 2019 సెప్టెంబర్ 15 తేదీన 1,251 మొక్కలను కేవలం గంటన్నర సమయంలో నాటి, ఆశ్చర్యపరిచారు.

అలాగే శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ డంప్ పైన 1,237 మొక్కలను కేవలం గంటలోపే నాటారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు బలరామ్​ను ఘనంగా సన్మానించాయి. శ్రీరాంపూర్ లోని కోల్ కెమికల్ కాంప్లెక్స్ వద్ద 1,061, శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ కు సమీపంలో 1,151  మొక్కలను ఒకేసారి  నాటారు.  ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ బలరామ్ స్వయంగా మొక్కలు నాటుతూ వెళ్లారు.

మియావాకీ ప‌‌ద్ధతిలో భూపాలప‌‌ల్లి, రామ‌‌గుండం, ఇల్లందు ప్రాంతాల్లో చిట్టడవులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా 40 ప్రాంతాల్లోని 39.78 ఎకరాల్లో 18 వేల మొక్కలను నాటడం విశేషం. మొత్తంగా 2019 సంవత్సరంలో 6,313 మొక్కల్ని  నాటగా.. 2020లో 3,686, 2021లో 2,810, 2022లో 2,460, 2023లో 2,431 మొక్కలు నాటారు.  

దేశ, విదేశాల్లోనూ..

ఒక్క సింగరేణిలోనే కాకుండా ఆయ‌‌న ప‌‌ర్యటించిన దేశంలోని ప్రతి రాష్ట్రం, విదేశాల్లోనూ పర్యావరణ పరిరక్షణపై ఆయన అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఆస్ట్రేలియా, ఢిల్లీతోపాటు ఒడిశా రాష్ట్రంలోనూ మొక్కలు నాటారు.

 ఇప్పటికే అడవుల నుంచి అంతరించిపోతున్న రావి, మర్రి, జువ్వి, సీమచింత వంటి 20 జాతుల మొక్కలనే నాటేందుకు ఆయన ఎంచుకోవడం విశేషం. అలాగే కోతుల బెడ‌‌ద నుంచి ఉప‌‌శ‌‌మ‌‌నం క‌‌లిగించేందుకు వీలుగా శ్రీ‌‌రాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గ‌‌ని సమీపంలో 600కు పైగా పండ్ల మొక్కలను నాటారు.